3 పెళ్లిళ్ల భర్తకి దేహశుద్ధి
చెన్నై: ఇప్పటికే ఇద్దరు భార్యలను కట్టుకున్నాడు. ఇప్పుడు మూడో భార్యను కట్టుకోవడానికి సిద్ధపడడంతో ఆ భర్తకి నడిరోడ్డులోనే ఇద్దరు భార్యల చేతిలో దేహశుద్ధి జరిగింది. కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన మైంది. వివరాలు… సూలూరు సమీపంలోని నెహ్రూనగర్‌కు చెందిన సౌందరరాజన్ కుమారుడు రంగ అరవింద దినేష్ (26) రాశిపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 2016లో తిరుప్పూర్ గణపతిపాళయానికి చెందిన రాజశేఖర్ కుమార్తె ప్రియదర్శినిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన 15 రోజుల్లో విభేదాలు చోటుచేసుకోవడంతో భార్యను చితకబాదాడు. దీంతో బాధితురాలు పేరూర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అనంతరం ప్రియదర్శిని తిరుప్పూర్‌లోని తల్లిదండ్రుల వద్దే వుంటోంది. భార్య పుట్టింటికే పరిమితం కావడంతో మొదటి వివాహాన్ని దాచి, రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మ్యాట్రిమోనిలో పేరు నమోదు చేసుకుని, కరూర్ జిల్లా పశుపతిపాళయానికి చెందిన అయ్యప్పన్ కుమార్తె అనుప్రియ (23)ను గత ఏప్రిల్ 10వ తేదీ రెండో వివాహం చేసుకున్నాడు. అనుప్రియకు కూడా ఇది రెండో వివాహమే. ఆమెకు రెండేళ్ల కుమారుడు కూడా వున్నాడు. దినేష్, అనుప్రియలు వివాహం అనంతరం ఓండిపుదూర్లో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. అయితే రెండవ భార్యతో కూడా దినేష్ తరచూ గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో భర్త వేదించడంతో మనస్తాపానికి గురైన అనుప్రియ కూడా పుట్టింటికి చేరుకుంది. రెండవ భార్య కూడా విడిచి వెళ్లడంతో మూడవ వివాహం కోసం దినేష్ మళ్లీ మ్యాట్రిమోనిలో పేరు నమోదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు భార్యలు దినేష్ ఇంటికి వెళ్లి అత్తామామలను నిలదీశారు. దినేష్ ఇంట్లో లేని కారణంగా అతను పనిచేసే కంపెనీ వద్దకు చేరుకున్నారు. లోనికి వాచ్మెన్ అనుమతించకపోవడంతో ఇద్దరు భార్యలు కంపెనీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న సూలూరు పోలీసులు దినేష్‌తో పాటు ఇద్దరు భార్యలను పోలీస్టేషన్‌కు విచారణకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. అప్పుడు కంపెనీ నుంచి బయటకు వచ్చిన దినేష్‌పై ఇద్దరు భార్యలు విరుచుకుపడి ఆవేశంగా చితకబాదారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా వినకుండా దేహశుద్ధి చేశారు. అపై పోలీసులు ముగ్గుర్ని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఇద్దరు భార్యలను మోసం చేసి వివాహం చేసుకోవడంతో పాటు, మూడవ వివాహానికి కూడా దినేష్ సిద్ధమయ్యాడని, అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.