అక్కడా..మనమే గ్రేట్‌

విదేశాలలో జీవనం సాగిస్తూ..ఇంటికి డబ్బు పంపేవారిలో 
అత్యధికులు భారతీయులే! 

వాషింగ్టన్‌ : విదేశాల్లో జీవనం సాగిస్తూ స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపే వలసదారుల్లో అత్యధికులు భారతీయులేనని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచంలో దేశాలతో పోల్చితే భారతదేశం నుంచే అత్యధికంగా వర్కర్లు విదేశాలకు వలసలు వెళ్లారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఆ లెక్క ప్రకారం దాదాపు 17 మిలియన్ల వర్కర్లు భారత్‌ నుంచి వెళ్లి వివిధ విదేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకర విషయమేమంటే, ఈ రకంగా విదేశాల్లో జీవనం కొనసాగిస్తూ దేశంలోని తమ తమ కుటుంబాలకు పంపిస్తున్న డబ్బు మొత్తం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటోందని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. 
గతేడాది సుమారు 79 బిలియన్‌ డాలర్ల మేరకు సంపద విదేశీ రెమిటెన్స్‌ రూపంలో భారత్‌కు చేరినట్టు పేర్కొంది. మిగతా ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. అదే విధంగా వలస వెళ్లి విదేశాల్లో జీవనోపాధి పొందుతున్న వారిలో కూడా అత్యధికులు భారతీయులేనని ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. వలసదారుల నుంచి విదేశీ రెమిటెన్స్‌ రూపంలో అత్యధిక జనాభా కలిగిన చైనా 67 బిలియన్‌ డాలర్లతో (10 మిలియన్‌ వలసదారులు) రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో భారతీయలు డబ్బు పంపిస్తున్నా.. అది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.7 శాతానికి మాత్రమే సమానంగా ఉందని వెల్లడించింది. 
వలసదారులు వారివారి దేశానికి పంపిస్తున్న డబ్బు చిన్న చిన్న దేశాలతో పోలిస్తే ఇది చాలా స్పల్పమని తేలింది. వలస, అభివద్ధి పేరిట రూపొందించిన నివేదికలో దిగువ మధ్య తరగతి ఆదాయ దేశాలు 2018 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2017 లో ఈ దేశాలన్నీ కలిపి 483 బిలియన్‌ డాలర్లను విదేశీ చెల్లింపులుగా పొందగా, గతేడాది ఈ సంఖ్య 529 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా విదేశీ చెల్లింపులపై ప్రధానంగా ఆధారపడుతున్న దేశాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 2017 లో రెండున్నర బిలియన్‌ డాలర్లను ప్రవాసుల ద్వారా పొందిన కిర్గిస్తాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి సమానమని పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న నేపాల్‌ పౌరులు మాత్రం 6.9 బిలియన్‌ డాలర్ల (28 శాతం) తో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలలో కీలక పాత్ర పోషించారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.