చట్టానికి ఎవరూ అతీతులు కారు

క్రికెటర్‌ షమి భార్య హసీన్‌ జహాన్‌ 

కోల్‌కతా: గహహింస కేసులో భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమిపై అరెస్టు వారెంట్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ నుంచి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని షమిని పశ్చిమ బంగాల్‌ కోర్టు ఆదేశించింది. దీనిపై షమి భార్య హసీన్‌ జహాన్‌ మీడియాతో మాట్లాడారు. ఆశారాం బాపూ, రామ్‌ రహీమ్‌ వంటి వారే చట్టం నుంచి తప్పించుకోలేకపోయారని, షమి ఎంత అని ఆమె అన్నారు. ‘షమికి బీసీసీఐతో పాటు స్టార్‌ క్రికెటర్లు మద్దతుగా ఉన్నారు. ఇది ఎంతోకాలం కొనసాగదు. ఆశారాం బాపు, రామ్‌ రహీమ్‌ వంటి వారే చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. షమి ఎంత? చేసిన తప్పుకి అతడు అంతిమంగా చింతిస్తాడు. చట్టం నుంచి తప్పించుకోలేడు. న్యాయమే గెలుస్తుంది. న్యాయస్థానం నిర్ణయంపై సంతోషంగా ఉంది’ అని హసీన్‌ పేర్కొన్నారు. 
షమీకి అరెస్టు వారెంట్‌ జారీ అయిన నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం షమిపై ఎటువంటి చర్యలు తీసుకోమని, అభియోగ పత్రాలు అందేవరకు ఆగుతామని బీసీసీఐ తెలిపింది. గత ఏడాది మార్చిలో షమీతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ హసీన్‌ జహాన్‌ గహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు షమీతో పాటు ఆయన సోదరుడిపై ఐపీసీ 498ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు.