వాయుసేనలో అపాచీ

పఠాన్‌కోట్‌: ప్రపంచంలోనే అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. ఈ ఏడాది జులైలో నాలుగు హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ భారత్‌కు అప్పగించింది. మంగళవారం మరో ఎనిమిది హెలికాప్టర్లను భారత వైమానికి దళానికి అందించింది. పఠాన్‌కోట్‌ భారత వైమానిక స్థావరానికి వీటిని అందించారు. ఈ సందఠంగా పఠాన్‌కోట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌. ధనోవా ఆధ్వర్యంలో వీటికి పూజలు నిర్వహించారు. అనంతరం వాటర్‌ కేనన్‌ సెల్యూట్‌తో వాయుసేన సైనికులు అపాచీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ధనోవాకు బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్తా సెరిమోనియల్‌ కీ అప్పగించారు. 
బోయింగ్‌ సంస్థ ఇప్పటివరకు 2200 అపాచీ హెలికాప్టర్లను వేరు వేరు దేశాలకు అందించింది. ఈ తరహా చాపర్లను ఉపయోగిస్తున్న 16వ దేశం భారత్‌ కావడం విశేషం. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని భారత వాయుసేన 2015లో కుదుర్చుకుంది. 2020నాటికి మొత్తం 22 హెలికాప్టర్లను భారత్‌కు బోయింగ్‌ అప్పగించనుంది. అంతకుమందు వీటికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు పరీక్షలను ఏఎఫ్‌ఎస్‌ హిండన్‌ వాయుస్థావరంలో విజయవంతంగా జరిపినట్లు భారత వాయుసేన ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన నాలుగు నిమిషాల వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.