యూపీ ఇన్‌చార్జిగా..!

ప్రియాంకకు పూర్తిస్థాయి సారధ్యంపై పార్టీ కసరత్తు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో పూర్తి జవసత్వాలు తీసుకు వచ్చి 2022 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ రాష్ట్రంలో అధికారానికి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీకి యూపీ మొత్తానికి ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక ఉన్నారు. ప్రియాంక చేపట్టబోయే కొత్త పాత్రపై త్వరలోనే పార్టీ అధిషా’నం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు మంగళవారంనాడు తెలిపారు. 
కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రియాంక ఇప్పటికే యూపీలో జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ, క్యాడర్‌తో మమేకమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అభ్యర్థులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరిపారు. అలాగే జిల్లాల వారీగా కాంగ్రెస్‌ నేతలను కూడా కలుసుకుని వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వీటన్నింటిని క్రోడీకరించి త్వరలోనే పార్టీ పునరుద్ధరణకు సమగ్ర వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

గత ఫిబ్రవరిలో రాహుల్‌ సైతం 2022లో యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పట్టుదలగా ఉందని ప్రకటించారు. ‘ప్రియాంక, జ్యోతిరాదిత్యను యూపీ పంపాను. ఇంకెంతమాత్రం అక్కడ పార్టీ బలహీనంగా ఉండటానికి వీల్లేదు. కాంగ్రెస్‌ను పటిష్టపరచే బాధ్యత ప్రియాంక, సింధియాకు అప్పగించాం. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటుకుని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’ అని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు.