‘ఓటరు ధ్రువీకరణ’ ప్రారంభం

ఈసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక క్యాంపు 

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఆదివారం దేశవ్యాప్త ఎన్నికల ధ్రువీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక క్యాంపును సైతం ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించి సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఓటర్లకు, ఎన్నికల కమిషన్‌కు మధ్య కమ్యూనికేషన్‌ మెరుగుపరిచేందుకు తోడ్పడుతుందని భావిస్తోంది. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 15న ముగుస్తుంది. 
ఈ సందర్భంగా ఈసీ సునీల్‌ అరోరా ‘నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌'(ఎన్‌వీఎస్‌పీ), యాప్‌ ను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ఎన్నికల సేవలను మెరుగ్గా నిర్వహించేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని, ప్రతిపౌరుడు ఈ ఓటరు ధ్రువీకరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈసీ కమిషనర్‌ అశోక్‌ లవాసా మాట్లాడుతూ.. ‘పౌరులందరికీ తమ ఓటరు వివరాలను ధ్రువీకరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఓటరు జాబితాల్లో తప్పులు లేకుండా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కాబట్టి పౌరులందరూ ఇందులో పాల్గొనాలి. ఓటర్లు తమ వివరాలు సరిచూసుకొని ఎన్‌వీఎస్‌ పోర్టల్‌, లేదా యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబసభ్యుల వివరాలు కూడా అందులో లేకపోతే మాకు పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఒక్కసారి ఈ పోర్టల్‌లో వివరాలు ధ్రువీకరించుకుంటే ఓటర్లకు తమ నంబరుకే ఎన్నికలకు సంబంధించిన వివరాలు మెసేజ్‌ ద్వారా అందుతాయని’ ఆయన వెల్లడించారు.