జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ!

మెరుగులు దిద్దుతున్న మోదీ సర్కారు 
కేంద్ర చట్టాలు, పథకాల అమలు కోసమే 

న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో అభివ ద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 106కుపైగా కేంద్ర చట్టాల అమలుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు, వివిధ పథకాల అమలుకు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనుంది. ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్రం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 31 నుంచి ఆ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనుంది. ఈ సంధికాలంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర చట్టాలు అమల్లో ఉంటాయి. అక్టోబర్‌ 31 నుంచి పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి మారేందుకు వీలుగా వందల కోట్ల రూపాయలతో కూడిన ఒక ప్యాకేజీ రూపకల్పనలో కేంద్రం నిమగ్నమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కార్మిక, విద్యుత్‌, పునరుత్పాదక ఇంధనం, మానవ వనరుల అభివ ద్ధి తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మూ-కశ్మీర్‌లోని ప్రాజెక్టులపై మదింపు జరిపారు. అక్కడ కేంద్ర చట్టాలను సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన నిధులపై విశ్లేషణ జరిపారు. వివిధ మంత్రిత్వశాఖలు అందించిన ప్రతిపాదనల ఆధారంగా నిర్దిష్టంగా ఎంత మొత్తం అవసరమన్నది ఇంకా గణించాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 
కొన్ని ప్రతిపాదనలివీ.. 
-జమ్మూ-కశ్మీర్‌లోని ఈఎస్‌ఐ చందాదారులకు ఆరోగ్య సేవలు అందించడానికి అక్కడ కొత్తగా ఒక ఆసుపత్రిని నిర్మించాలని కార్మిక శాఖ ప్రతిపాదించింది. 
-విద్యా హక్కు చట్టం అమలు చేయడానికి కేంద్రం కోట్ల రూపాయలు అందించనుంది. 
– రాష్ట్రంలోని ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలు, రాయతీలను అందించడానికి వీలుగా ఆధార్‌ చట్టం-2016ను కేంద్రం అమలు చేయనుంది. 
ఉన్నతాధికారుల సమీక్ష 
మరోవైపు జమ్మూ-కశ్మీర్‌ పునర్‌విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకున్న మార్గాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎ.కె.భల్లా అధ్యక్షతన పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుతున్న జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లో పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటిని ఖరారు చేయడానికి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌, అధికారులు వచ్చే నెలలో ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యాటకులకు మార్గనిర్దేశం చేసే గైడ్‌లకు శిక్షణ ఇస్తామని, వివిధ భాషలను వారికి పరిచయం చేస్తామని మంత్రి తెలిపారు.