ఏచూరికి అనుమతి
జమ్ముకశ్మీర్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సుప్రీం సీజే
న్యూఢిల్లీ: అధికరణ 370 రద్దు సహా కశ్మీర్ అంశంపై దాఖలైన 15 వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతత్వంలోని ప్రత్యేక ధర్మాసనం వీటిపై వాదనలు స్వీకరించింది. ఈ సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. జమ్ముకశ్మీర్ వెళ్లేందుకు ఆయనను అనుమతించింది. అక్కడికి వెళ్లిన తరవాత తమ పార్టీ నేత మహ్మద్ యూసఫ్ తరిగామిని మాత్రమే కలవాలని.. నిబంధనలు ఉల్లంఘిచవద్దని ఆదేశించింది. ఒకవేళ ఆదేశాలు ఉల్లఘించినట్లయితే నివేదిక ఇవ్వాలని కోరింది. పౌరులు దేశంలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే, జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి మహ్మద్ అలీం సయ్యద్ కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. అనంతనాగ్ జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చి రిపోర్టు చేయాలని తెలిపింది. అవసరమైతే అలీంకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అధికరణ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల దష్ట్యా పలువురు రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అందులో సీపీఎం నేత యూసఫ్ తరిగామి కూడా ఉన్నారు. అయితే నిర్బంధంలో ఉన్న తరిగామి అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఆయనను చూసేందుకు ఏచూరి వెళ్లగా.. ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. తరిగామి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తరిగామిని త్వరితగతిన కోర్టు ముందుకు తీసుకొచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై ఈ రోజు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తరిగామిని కలిసేందుకు ఏచూరిని అనుమతించింది.