శ్రీశైల ‘జల’దృశ్యం
10 గేట్ల ఎత్తివేత..దిగువకు 2,43,171 క్యూసెక్కుల నీరు విడుదల
శ్రీశైలం:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. భారీగా వరద ప్రవాహం ఉండటంతో అధికారులు మొత్తం 12 గేట్లకు గానూ 10 గేట్లను ఎత్తి దాదాపు 2,43,171 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ఒక్కోగేటును 10 మీటర్ల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4.04లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు వారు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.70 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 202.96 టీఎంసీలకు నీటి నిల్వ పైగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31,059 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులు, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేటరీ ద్వారా 28,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 1.02లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6,051 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ.. ప్రస్తుతం 520.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 150.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు జూరాల జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 40 గేట్లను ఎత్తి సుమారు 5.32 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నా
రు. జూరాల ప్రాజెక్టుకు 5.30లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం నీటి నిల్వ6.142 టీఎంసీలుగా నమోదైంది.