కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

న్యూఢిల్లీ: 
భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు ముగిశాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కన్నుమూసిన సుష్మాస్వరాజ్‌ పార్థివ దేహాన్ని తొలుత ఆమె నివాసానికి తరలించారు. అనంతరం బుధవారం ఉదయం కార్యకర్తలు, నేతల సందర్శనార్థం భాజపా కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం అభిమానులు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య దిల్లీ వీధుల్లో సుష్మా స్వరాజ్‌ అంతిమ యాత్ర కొనసాగింది. అనంతరం లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 
సుష్మాస్వరాజ్‌ అంతిమ సంస్కారాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, నితిన్‌ గడ్కరీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అశోక్‌ గహ్లూెత్‌, గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌, పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. 
దేశ, విదేశీ ప్రముఖుల సంతాపం 
సుష్మా స్వరాజ్‌ మతిపట్ల దేశ, విదేశీ ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం ఓ గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందని విచారం వ్యక్తంచేశారు. మరోవైపు, సుష్మా స్వరాజ్‌ మతికి రాజ్యసభ నివాళి అర్పించింది. 
సెల్యూట్‌ చేసిన తండ్రీకూతుళ్లు 
మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ పార్థీవదేహాంపై త్రివర్ణ పతకాన్ని ఉంచారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధానకార్యాలయంలో సుష్మాకు వీడ్కోలు పలికారు. సుష్మా కూతురు బాన్సురీ స్వరాజ్‌, భర్త స్వరాజ్‌ కౌశల్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో సుష్మాకు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తండ్రీకూతురు కన్నీటి పర్యంతమయ్యారు. దుక్కాన్ని దిగమింగుతూనే సుష్మా పార్ధీవదేహానికి ఇద్దరూ సెల్యూట్‌ చేశారు. అంతకముందు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ నివాళి అర్పించారు. ఎండీహెచ్‌ స్పైస్‌ కంపెనీ మహాశయ్‌ ధర్మమ్‌పాల్‌ గులాటీ సుష్మా పార్దీవదేహం వద్ద బోరును విలపించారు. సుష్మా చాలా అర్థవంతమైన జీవితాన్ని గడిపారని దలైలమా తన నివాళిలో పేర్కొన్నారు. ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కూడా సుష్మా మతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం గురించి సుష్మా ఎంతో కషి చేసినట్లు ఎంబసీ అభిప్రాయపడింది. 
బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంతో యావద్దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘనంగా నివాళులర్పించింది. తమ ప్రియతమ నేతకు తుది నివాళులర్పించేందుకు పార్టీలకు అతీతంగా ప్రముఖ నేతలంతా ఆమె నివాసానికి ఉదయం నుంచి చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ బుధవారం ఉదయం సుష్మ నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సుష్మ స్వరాజ్‌ కుటుంబీలను ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడు ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 
కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. సుష్మ నివాసానికి చేరుకుని ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు. ఆమె భర్త కౌశల్‌ స్వరాజ్‌, కుమార్తెను ఓదార్చారు. ఆ సందర్భంలో మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సుష్మ భర్తను పరామర్శిస్తుండగా ఆయన కళ్లు చెమర్చాయి. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు. 
సుష్మకు ఉదయం నుంచి నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజ్వాల్‌, టీఎంసీ ఎంసీ డెరిక్‌ ఒబ్రెయిన్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి, బీజేపీ కార్యనిర్వాహక అద్యక్షుడు జేపీ నడ్డా, సమాజ్‌వాదీ పార్టీ అద్యక్షుడు ములాయం సింగ్‌, యోగాగురువు రాందేవ్‌ బాబా, బీజేపీ ఎంపీ హేమమాలిని, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ, బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి తదితరులు ఉన్నారు. సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పిస్తూ సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌ గోపాల్‌ యాదవ్‌ కన్నీరుమున్నీరయ్యారు. 
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి దివంగత సుష్మాస్వరాజ్‌ కు రాజ్యసభ ఘనంగా నివాళులర్పించింది. బుధవారం సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే తొలుత సుష్మాస్వరాజ్‌కు సభ్యులంతా నివాళులర్పించారు. తమ స్థానాల నుంచి లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంతో ఒక సమర్ధవంతమైన పాలనాదక్షురాలిని, పార్లమెంటేరియన్‌ను, అసలు సిసలైన ప్రజావాణిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలసభలో సుష్మకు నివాళులర్పించిన వారిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. 
సుష్మాస్వరాజ్‌ మతితో దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బీజేపీ అగ్రనేత ఎల్‌కె అడ్వాణీ ఓ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని అన్నారు. సుష్మ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
‘నాకు అత్యంత ఆప్తురాలైన సుష్మాజీ ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. బీజేపీతో తొలినాళ్ల నుంచి మమేకమవుతూ ఎంతో ప్రతిభావంతురాలిగా సుష్మ పేరుతెచ్చుకున్నారు. 80వ దశకంలో నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టీమ్‌లో ఎంతో చురుకుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం నాకింకా గుర్తుంది. ఆ తర్వాత అంచలంచెలుగా ఆమె బీజేపీలో అత్యంత ఆదరణ కలిగిన నాయకురాలిగా ఎదిగారు. ఆమె చాలా గొప్ప వక్త. ఆమెకున్న జ్ఞాపక శక్తి, ఆయా విషయాలను సందర్భానుసారంగా ఆమె ఎంతో స్పష్టంగా వివరించి చెబుతున్నప్పుడు ఆమె ప్రతిభ చూసి ఎంతో అబ్బురపడేవాడిని’ అని అడ్వాణీ గుర్తు చేసుకున్నారు. 
సుష్మాస్వరాజ్‌ ఒక గొప్ప మానవతావాదని, ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో మమేకమయ్యేవారని అడ్వాణీ అన్నారు. ఏటా తన పుట్టినరోజుకు తనకెంతో ఇష్టమైన చాకొలెట్‌ కేక్‌ సుష్మ తీసుకువచ్చేవారని, ఒక్క ఏడాది కూడా ఆమె అలా చేయకపోవడం తనకు గుర్తుకులేదని అన్నారు. సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంతో దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందన్నారు. వ్యక్తిగతంగా ఆమె మ తి తనను కలిచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అడ్వాణీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జాతీయ రాజకీయాల్లో ఓ ‘మెరుపుతార’లా సుష్మాస్వరాజ్‌ ఆవిర్భవించారని, సమర్ధవంతమైన పాలనాదక్షురాలుగా ఆమె నిరూపించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సుష్మాసర్వాజ్‌ పార్థివదేహానికి ఇవాళ ఉదయం అమిత్‌షా నివాళులర్పించారు. 
అనంతరం అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్‌ ఇంత త్వరగా అందరినీ వదలివెళ్తారని అనుకోలేదని అన్నారు. జాతీయ రాజకీయాలకు ఆమె మ తి తీరనిలోటని పేర్కొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించినప్పుడు సుష్మాస్వరాజ్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారని, ఆ తర్వాత అటల్‌ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో కార్యదక్షత కలిగిన నాయకురాలిగా సత్తా చాటుకున్నారని అన్నారు. భారత రాజకీయాల్లో ఆమె లేని లోటు చాలాకాలం వరకూ అలాగే ఉండిపోతుందన్నారు. సుష్మాస్వరాజ్‌ కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం కలిగించాలని తాను కోరుకుంటున్నట్టు అమిత్‌షా చెప్పారు. 
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మరణంపట్ల కేంద్ర మంత్రి స్మ తి ఇరానీ భావోద్వేగానికి గురయ్యారు. ‘నాకు మీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ(సుష్మా స్వరాజ్‌). బన్సూరీతో కలిసి నన్ను రెస్టారెంట్‌కు తీసుకెళ్తానని ప్రామిస్‌ చేశావు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయావు’ అంటూ భావోద్వేగ సందేశాన్ని స్మ తి ఇరానీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు 
బీజేపీ సీనియర్‌ నేత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పార్థిక దేహానికి కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ బుధవారంనాడు నివాళులర్పించారు. సుష్మ కుటుంబ సభ్యులను సోనియాగాంధీ ఓదార్చారు. 
మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మన్మోహన్‌ సింగ్‌ సైతం సుష్మా నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. సుష్మాస్వరాజ్‌ ఆకస్మిక మతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె మతితో దేశం ఓ గౌరవనీయురాలు, అంకితభావం కలిగిన నాయకురాలని కోల్పోయిందని మన్మోహన్‌ అంతకు ముందు ఓ సంతాప సందేశంలో పేర్కొన్నారు. లోక్‌సభలో సుష్మ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆమెతో తనకున్న అనుబంధం, నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ గౌరవించే ఔన్నత్యం కలిగిన నాయకురాలని అన్నారు. కేంద్ర మంత్రిగా అసాధారణ పనితీరు ప్రదర్శించడమే కాకుండా గొప్ప పార్లమెంటేరియన్‌గా ఆమె గుర్తుండిపోతారని అన్నారు