హెల్మెట్‌ ధరించేలా చైతన్యం

హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్‌ల వాడకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని హైదరాబాద్‌ జిల్లా రవాణా అధికారులు తెలిపారు. ఆటో మొబైల్‌ డీలర్లు, స్వచ్ఛందసంస్థల సహకారంతో హెల్మెట్లను తప్పనిసరిగా ధరించేలా ప్రోత్సహిస్తారు. బైకు కొన్నప్పుడే హెల్మెట్‌ ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. గ్రేటర్‌ పరిధిలో అమలు చేస్తున్న పాయింట్ల విధానం వాహనదారులకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. ఇప్పటివరకూ చలాన్లు రాసి జరిమానాలు వసూలు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై అదనంగా ఆయా వాహనదారులకు పాయింట్లను నమోదు చేస్తున్నారు. ఇదిలావుంటే సురక్షిత వాహన ప్రయాణానికే ట్రాఫిక్‌ నిబంధనలు అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా వాహనాలు నడిపితే అందరూ సురక్షితంగా ప్రయాణిస్తారని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు. ఎంవీ యాక్టులో నియమాలను అమలు పరిచే దిశగా ట్రాఫిక్‌ విభాగం అడుగులు వేస్తుందన్నారు. ట్రాఫిక్‌ అధికారుల ట్యాబ్‌లో సంబంధిత సాఫ్ట్‌వేర్‌ అపడేట్‌ చేశారన్నారు. ప్రజలకు ప్రధానంగా వాహనాదారులకు ఈ పాయింట్లపై అవగాహన కల్పించడానికి కరపత్రాలు, పోస్టర్లు రూపొందించారు. వాహనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ జీరో పాయింట్లతో హీరోగా ఉండాలని పౌరులకు సూచించారు. జీరో పాయింట్లు కొనసాగిస్తూ హీరోలుగా ఉండండని పేర్కొన్నారు.