తెలుగు భాషను కాపాడుకోవాలి
మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
ఆంధ్ర సారస్వత పరిషత్,చైతన్య విద్యా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5,6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరుగనున్నాయి.ఆ సమావేశ కరపత్రికను మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాస గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా భాష ఒకటేనని, తెలుగు భాషని కాపాడుకోవడం అందరి బాధ్యత అని, మాతృ భాష అమ్మ లాంటిదని,అందుకని అమ్మని మరువకూడదని,భాషని వదలకూడదని, భాషకు సంబంధించిన కార్యక్రమాలు నిరంతరం జరుపుకోవాలని,కవులను,పండితులను సత్కరించుకోవాలని సూచించారు. జనవరి 6వ తారీఖున జరిగే ‘‘తెలుగు తోరణం’’అనే సాంస్కృతిక కార్యక్రమానికి తాను తప్పకుండా హాజరవుతున్నానని అన్నారు.సారస్వత పరిషత్ ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్ మాట్లాడుతూ 5, 6, 7 తేదీలలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు,తెలుగు భాషలోని వివిధ సాహిత్య పక్రియలపై సదస్సులు జరుగుతున్నాయని అందరూ హాజరుకావాలని కోరారు.కార్యక్రమంలో హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యులు కె.సుధీర్,ఈ.కృష్ణ పాల్గొన్నారు.