నేడు ‘ఒంగోలు ఆర్య వైశ్య మండల’ఎన్నికలు
- ముగిసిన హోరాహోరీ ప్రచారం
(ప్రత్యేక ప్రతినిధి)
ఒంగోలు,జ్యోతిన్యూస్ :
అటు పౌరుషానికి,ఇటు వర్తక వ్యాపారానికి,మరో వైపు దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతనకు మారుపేరుగా నిలిచే జిల్లా ఒంగోలు.మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు అడుగు జాడల్లో నడుస్తూ, ఇతర సామాజిక వర్గాలకు ధీటుగా ఆర్యవైశ్యులు ఉన్న జిల్లా. అందుకే ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్య వైశ్య సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలోని ఆర్యవైశ్యులకు వెన్నుదన్నుగా నిలిచే ప్రకాశం జిల్లా మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆంధప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్,డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్,జిల్లా ఎన్నికల అధికారి కుప్పం ప్రసాద్ స్వీయ పర్యవేక్షణలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ నెల 17వ తేదీన ఎన్నికలు సాఫీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇతర మండలాల ఎన్నికలు ఏకగ్రీవంగా జరగగా, ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు పోటాపోటీగా జరుగుతుండడం గమనార్హం.సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ,అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తూ,విజయం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.అటు కర పత్రాల ద్వారా,ఇటు సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రమించారు.2,300 మంది ఓటర్లు ఉన్న ఆర్యవైశ్య మండల అధ్యక్ష పీఠం కోసం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.పబ్బిశెట్టి శ్రీనివాస రావు, పబ్బిశెట్టి వెంకట విజయ భాస్కర్, పోలేపల్లి వెంకట మణి కుమార్, పేరకం నాగ ఆంజనేయులు,నేరేళ్ళ శ్రీనివాస రావు, జంధ్యం రాధా రమణ గుప్తా,సామి వెంకట సుబ్బారావు,కోడూరి కిశోర్, గుర్రం సత్యనారాయణ స్వామి, గుర్రం బదిరీ నారాయణ, బియ్యపు విజయ కుమార్ లు ఎన్నికల కురుక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయని, మండల ఎన్నికల అధికారి కనమర్లపూడి హరిప్రసాద్ రావు, మండల కన్వీనర్ మిరియాల కృష్ణ మూర్తి, ఎన్నికల సహాయకులు చినిగేపల్లి సురేష్, ఆంధప్రదేశ్ ఆర్యవైశ్య మహా సభ కార్యదర్శి పల్లపోతు వెంకటేశ్వరరావులు తెలిపారు.