జమ్మూ కాశ్మీర్‌లో ‘ఎన్నికలు’ ?
- ప్రధాని నివాసంలో జమ్మూ కాశ్మీర్ నేతలు
- సమావేశానికి హాజరైన నలుగురు మాజీ సిఎంలు
- గులాంనబీ కూడా హాజరు
- మెహబూబా ముఫ్తీపై జనం ఆగ్రహం
- జమ్మూలోని వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
జమ్మూ కశ్మీర్ నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ మఖ్యమంత్రులు ఫారూఖ్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మరో 10 మంది నేతలు హాజరు అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నాటి నుంచి కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితిలో లేవు. జమ్మూ కశ్మీర్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడం దీనికి ఒక కారణం. అయితే జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రస్థాయి హోదాపై ఇస్తారనే ప్రచారం విస్తృతంగా జరగబోతోంది. ప్రస్తుతం జరుగుతోన్న సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్రం సముఖంగా ఉన్నట్లు సమాచారం. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మాత్రమే జరిగాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఉన్నప్పటికీ ఎన్నికలు జరపకుండా లెప్టినెంట్ గవర్నర్ పాలనలోనే పాలన సాగిస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రానికి కొన్ని ఉద్దీపనలతో ఊరట కల్పించే యోచనలో కేంద్రం ఉందని ఓ వైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ రాష్ట్రం కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకుంటామని, ఈ విషయమై ప్రధానితో చర్చిస్తామని కశ్మీర్ నేతలు సమావేశానికి ముందు తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన అనంతరం రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడదీసి రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. రాజకీయంగా కశ్మీర్‌ను కుదిపేసిన ఈ నిర్ణయం జరిగిన రెండేళ్ల తర్వాత అక్కడి రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి. ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది.
జమ్మూలోని వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు….
జమ్మూకశ్మీర్ అంశంపై చర్చించే విషయంలో పాకిస్థాన్‌ను కూడా భాగస్వామిగా చేయాలని మెహబూబా ముఫ్తీ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జమ్మూలో నిరసనలు మొదలయ్యాయి. ఈరోజు డోగ్రా ఫ్రంట్ అనే సంస్థ సభ్యులు జమ్మూలోని వీధుల్లోకి వచ్చి, మహబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇలా వ్యాఖ్యానించినందుకు మహబూబాను జైలుకు తరలించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ••డీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ రోజు ఆమె కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ఆమెతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్నివ్యతిరేకించిన గుప్కర్ కూటమి నాయకులు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించారు.