తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు
- 30వ తేదీ వరకు అమలు
హైదరాబాద్,జ్యోతిన్యూస్
తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ దానికి అనుగుణంగా జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే వర్తించనున్నట్లు తెలిసింది. లాక్‌డౌన్ విధించిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయ ంపై కేసీఆర్ రాష్ట్ర మంత్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందున ఈ నెల 20న నిర్వహించా ల్సిన కేబినెట్ సమావేశాన్ని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రోజూ ఉదయం 10 గంటల నుంచి 20 గంటల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతోంది. జన సంచారం, క్రయవిక్రయాలు, ఇతర కార్యకలాపాలకు నిషేధాజ్ఞలు వర్తిస్తాయ ని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రజల సౌకర్యార్థం రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఇతర కొనుగోళ్లకు, కార్యకలాపాలకు వీలు కల్పించారు. అత్యవసర సేవలు, ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో యథావిధిగా పనిచేయనున్నాయి. ఉపాధిహామీ పనులూ యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని, వంట గ్యాస్ సరఫరా కొనసాగుతుందని వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు అంతర రాష్ట్ర బస్సు సర్వీసులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.