టిఆర్‌ఎస్‌తో ఈటెలకు బంధం తెగినట్లే
- ఎదురుదాడికి దిగుతోన్న మంత్రులు
- రంగంలోకి దిగిన కరీంనగర్ నేతలు
- అమీతుమీకే సిద్దం అయిన మాజీమంత్రి
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు టిఆర్‌ఎస్‌కు మధ్య బంధం దాదాపుగా తెగిపోయినట్లే. తాజాగా ఈటెల దూకుడుగా తన భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నారు. మరోవైపు మంత్రులు గంగుట కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ•, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌లు రంగంలోకి దిగి ఈటెలను విమర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఇక టిఆర్‌ఎస్‌తో ఈటెలకు ఉన్న బంధాలు దాదాపుగా తెగిపోయినట్లుగానే చెప్పాలి. ఈటెల కూడా తొలిదశగా ఎన్నారైలతో మాట్లాడారు. ఈటల రాజేందర్ భార్య జమున పేరిట ఉన్న హ్యాచరీస్ కోసం అసైన్డ్ భూములను కబ్జా చేశారని ప్రభుత్వానికి నివేదిక వెళ్లడం.. ఆ వెంటనే ఈటలను మంత్రి వర్గం నుంచి తప్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం.. ఆ మేరకు గవర్నర్ నుంచి ఉత్తర్వులు వెలువడట ంతో ఈటెలను తప్పించారు. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది సర్వత్రా చర్చనీయాం శంగా మారింది. ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. మొదటి నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్ పార్టీలో ఈటల కీలకంగా వ్యవహరించారు. అకస్మాత్తుగా టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఈటలపై చర్యలు తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి సానుభూతి లభిస్తోంది. ఈ నేపథ్యంలో తనతో కలిసొచ్చే వారితో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఈటల నిమగ్నమైనట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలు టీఆర్‌ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొందరు ఆయన్ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం, బీసీ కులాల ఐక్యవేదిక, ఎమ్మార్పీఎస్, సగర కులసంఘం, లంబాడి ఐక్యవేదిక, ముదిరాజ్ సంఘంతో పాటు పలు సంఘాల నేతలు ఈటలను కలిసి తమ మద్దతును ప్రకటించారు. తన నియోజకవర్గం హుజురాబాద్•-కు చేరుకున్న ఈటెల ఇప్పటికే తన అనుయాయులతో సమాలోచలను చేస్తున్నారు. త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న దళిత, బహుజనుల కోసం పార్టీ స్థాపించాలని ఈటల రాజేందర్‌ను ఓయూ దళిత బహుజన విద్యార్థులు కోరారు. ఇటీవల ఆయన ఇంటికి వెళ్లిన విద్యార్థులు, తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కోదండరామ్ ఇప్పటికే పార్టీ పెట్టి విఫలమయ్యారు. అలా ఆలోచిస్తే ఈటెల ఏమేరకు విజయం సాధిస్తారన్నది కూడా ప్రశ్నే. ఇకపోతే తెరాసకు లభిస్తున్న విజయాలను చూసి, ప్రజలు కేసీఆర్ పాలనా సరళిని ఆమోదిస్తున్నారని అనుకోవడం భ్రమ మాత్రమే. ఎంఎల్‌సి ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో విజయాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బలుపు కాదని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ పాలనా తీరుకు లభించిన మద్దతు అనుకోవడానికి కూడా లేదు. ఎన్నికలలో పొందే ప్రతి విజయమూ పాలకులలో ప్రజల పట్ల బాధ్యతను పెంచాలి. కానీ తమకు తిరుగేలదన్నట్లుగా మరింత నిరంకుశంగా మారుస్తుందని రుజువు చేసుకుంటు న్నారు. ఎదుటి పక్షంలో పోరాడే వాళ్ళు లేకుండా బలహీనపరిస్తే, అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు మిగలరన్న పద్దతిలో కెసిఆర్ రాజకీయాలు నడుపుతూ వస్తున్నారు. ప్రజా సంఘాలపై నిషేధం, ప్రజల పౌర హక్కుల అణచివేత, ప్రజా సంఘాల కార్యక్రమాలపై ఆంక్షలు, చివరికి ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళతో అధికార పార్టీ వ్యవహరించిన తీరు – ఇవన్నీ ఇదే కోవలోకి వస్తాయి. ఈటల రాజేందర్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు దీనినే సూచిస్తుంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని గుర్తించి రాజకీయ నేతలు ఆలోచించాలి. ఈటల రాజేందర్ విషయంలో భూమి సమస్యను ఎజండా దకు తెచ్చి లోతుగా చర్చించడం. అసైన్డ్ భూములను ఎవరు కబ్జా చేసినా వాటిపై సమగ్ర విచారణ చేసి, వాటిని నిజంగా భూమిలేని పేదలకు తిరిగి ఇప్పించడం వంటి కార్యక్రమాలు వేగంగా జరగాలి. అప్పుడే కెసిఆర్ నిబద్దతను ఆదరిస్తారు.