ఈటెలపై ఎదురుదాడికి దిగిన టిఆర్ఎస్
- కేసీఆర్ అక్కున చేర్చుకుంటే పార్టీని విచ్చిన్నం చేసే కుట్ర
- ప్రభుత్వ పథకాలను విమర్శించి పార్టీని అవమానించారు
- ఎందరినో కాదని ఈటెలకు మంత్రి పదవి ఇచ్చారు
- మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించిన మంత్రులు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
మంత్రివర్గం నుంచిబహిష్కరణకు గురైన ఈటెల రాజేందర్‌పై టిఆర్ఎస్ ఎదురుదాడికి సిద్దమయ్యింది. టిఆర్ఎస్పై అతుకి సిద్దమైన క్రమంలో ఇక టిఆర్ఎస్ నేతలు కూడా ఈటెలపై విమర్శలకు సిద్దమయ్యారు. తెలంగాణ భవన్లో కరీంనగర్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, మాజీ ఎంపి, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌లు డియాతో మాట్లాడుతూ ఈటెలపై కెసిఆర్ చర్యలను సమర్థించారు. ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి. బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర. ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఈటల రాజేందర్ విమర్శల్లో వాస్తవం లేదు. టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని ఈటల రాజేందర్ చెప్పడం సత్యదూరం. ఈటల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం జరగలేదు. టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసే విధంగా పలుసార్లు ఈటల మాట్లాడారని మరోమంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2003లో ఈటల రాజేందర్ పార్టీలో చేరారు. పార్టీలో ఈటల చేరకముందే ఉద్యమం ఉధృతంగా ఉందన్నారు. ఉద్యమ కాలంలోనూ ఈటలను కేసీఆర్ అన్ని విధాలా గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి పేర్కొ న్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే ఈటలకు చోటు దక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఈటల రాజేందర్‌కు ఏం తక్కువైందో తమకు అర్థం కావడం లేదన్నారు. ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ అన్ని రకాల పదవులు, అవకాశాలు ఇచ్చారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా, ఆర్థిక, పౌరసరఫరాలు, వైద్య శాఖ మంత్రిగా ఈటలకు అవకాశం ఇచ్చారు. పథకాలపైన కూడా మాట్లాడి విమర్శించడం చాలా బాధాకరం. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. పేదలకు, దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొనకూడదని ఈటలకు తెలియదా అని ప్రశ్నించారు. 66 ఎకరాల అసైన్డ్ భూమిని కొన్నానని ఈటలనే స్వయంగా చెప్పారు. అసైన్డ్ భూములను వ్యాపార విస్తరణ కోసం కొనుగోలు చేసినట్లు ఈటలే చెప్పారు అని గుర్తు చేశారు. ఈటలకు వ్యాపారమే ముఖ్యం.. బీసీలు, ఎస్సీల స్థితిగతులు పట్టవు అని చెప్పారు. ఎకరం కోటిన్నర పలికే భూమిని రూ. 6 లక్షలకే కొనుగోలు చేశారు. విలువైన భూములను తక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేశారు. దేవరయాంజల్లో దేవాలయ భూములను కూడా కొనుగోలు చేశారు. దేవాలయ భూములని తెలిసి కూడా ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. పార్టీ ద్వారా అనేక రకాలుగా ఈటల లబ్ది పొందారు. కు ఏదో అన్యాయం జరిగిందని సీఎంపై దాడి చేయడం తగదు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆయన ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడలేదు. ముదిరాజ్‌లకు చేప పిల్లలు ఇవ్వాలని ఎప్పుడైనా కేసీఆర్‌ను రాజేందర్ కోరరా? అని ప్రశ్నించారు. ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వారికి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇవాళ పదవి పోగానే ముదిరాజ్‌లు గుర్తుకు వస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ముదిరాజ్‌లను ఎందుకు దగ్గరకు తీయలేదు? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఈటలను సొంత తమ్ముడిలా భావించి సీఎం కేసీఆర్ ఆదరించారు. 2018 ఎన్నికల్లో బీసీ నాయకుడిని ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. అది సరికాదు. కల్యాణలక్ష్మి వద్దంటావు. ఆసరా పెన్షన్లు పరిగే అంటావు. ప్రభుత్వ పథకాలను విమర్శించారు. పార్టీలో తిరుగుబాటు తీసుకొచ్చేందుకు ఈటల ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన గౌరవానికి భంగం కలగొద్దని పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హుజురాబాద్‌లో బీసీలను అణగతొక్కారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నానని చెప్పిన ఈటల.. ఇంత తక్కువ సమయంలో వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయాలు ఎలా సంపాదించాడు. మెడికల్ కాలేజీ ఎలా వచ్చింది. పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చి, ప్రభుత్వంలో అన్ని రకాల పదవులు ఇచ్చినందుకే ఇవన్నీ సాధ్యమయ్యాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని బాధ పడిన వ్యక్తి ఈటల రాజేందర్ అని తెలిపారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆరుసార్లు తాను గెలిచానని చెప్పడం కాదు.. కేసీఆర్ బొమ్మ దనే గెలిచావు. టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో గెలుస్తుందంటే.. దానికి కారణం కేసీఆర్ బొమ్మ అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. కేసీఆర్ ఒక లెజెండ్.. ఒక శక్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు. గత కొద్ది రోజులుగా ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఈటల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ఈటల విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ఆ పథకాలను విమర్శించడు. కానీ రాజేందర్ లాంటి బీసీ నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. రైతుబంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంత గొప్ప పథకాన్ని రాజేందర్ విమర్శించడం బాధేసిందన్నారు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ ప్లోర్ లీడర్‌గా కేసీఆర్ నియమించారు. ఉద్యమంలోనూ సముచితమైన స్థానం కల్పించారు. రాజకీయ నాయకులు అసైన్డ్ భూముల జోలికి పోవద్దు. అసైన్డ్ భూమి ఎవరూ అమ్ముకోవద్దు. అమ్మడానికి వీల్లేదు అని ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. మరి ఆ నిబంధనను ఉల్లంఘించడం నేరం కాదా అన్నారు. . దానిపై విచారణ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గానికి ఏది కావాలంటే అది సీఎం మంజూరు చేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందు ఒక సంవత్సర కాలం పాటు కేసీఆర్ వివిధ రాజకీయ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు, మేధావులతో తెలంగాణ సమస్యలు, నాడు జరుగుతున్న అలజడులు, అశాంతి, రైతుల ఆత్మహత్యలు, యువకులను నక్సలైట్ల పేరిట చంపడం.. ఇలాంటి అనేక అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతేనే ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చర్చలు జరుగుతున్న రోజులవి. ఈ ప్రజలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటమే భవిష్యత్ అని నిర్ణయిం చారు. కరెంట్, నీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించ బడింది.పార్టీ ఏర్పాటైనే వెంటనే పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టారు. నాటి సీఎం చంద్రబాబు చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తది.. టీఆర్ఎస్ ఓడిపోతదని బాబు ఊహించారు. 2001లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగినప్పుడు రైతు నాగలి గుర్తుపై పోటీ చేయడం జరిగింది. నాటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కరీంనగర్ జిల్లా పరిషత్‌ను కూడా కైవసం చేసుకున్నాం. అలా విజయం సాధించి చంద్రబాబుకు గట్టి తీర్పునిచ్చాం. 2003లో ఈటల టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఎంతో మందిని వదులుకుని ఈటలకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఇప్పటికైనా కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.