ఈటెలపై భూ ఆక్రమణ ఆరోపణలు

  • ఈటెలను తప్పించేందుకు రంగం సిద్దం
  • ఆరోపణలపై విచారణకు కేసీఆర్‌ ఆదేశాలు
  • టిఆర్‌ఎస్‌లో జోరుగా చర్చోపచర్చలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :

‌టీఆర్‌ఎస్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ ‌భూ ఆక్రమణ వ్యవహారం దుమారం రేపుతున్నారు. ఈటల రాజేందర్‌పై కబ్జా ఆరోపణలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణల ఆధారంగా ఈటలపై వేటుకు రంగం సిద్ధమైందని టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే సిఎం కెసిఆర్‌ ఈటెల భూ కబ్జాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు సిఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌కు ఆదేవాలిచ్చారు. కలెక్టర్‌ ‌నుంచి నివేదిక తెప్పించాలని అన్నారు. ఇదే సందర్బంలో కబ్జా ఆరోపణలపై ఈటల వివరణ ఇవ్వనున్నారు. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారంటుని ఆయన వాపోయారు. ఇటీవల ఈటల చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌లో కలకలం రేగుతోంది. కిరాయిదారులం కాదు.. పార్టీకి ఓనర్లమంటూ ఇటీవల ఈటల రాజేందర్‌ ‌వ్యాఖ్యానించి టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించారు. మంత్రి ఈటల గత కొంతకాలంగా పార్టీ నిర్వహించే కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో సీఎం కేఆర్‌ ‌నిర్వహించే మంత్రివర్గ సమావేశానికి కూడా ఈటలకు ఆహ్వానం లేకుండాపోయింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో.. ఆయా నియోజకవర్గాలతో సంబంధం లేనప్పటికీ ఇతర జిల్లాలకు చెందిన నేతలను ప్రచారానికి తీసుకువచ్చారు. కానీ ఈటల సేవలను ఎక్కడా వినియోగించుకోవడంలేదు. ముఖ్యంగా సీఎం సమావేశానికి కూడా ఈటలకు ఆహ్వానం రావడంలేదు. ఇటీవల కాలంలో ఈటల వ్యాఖ్యలను చూస్తుంటే టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారనేది తెలుస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు తిరుగుబాటు బావుట ఎగురవేసే అవకాశం ఉందనే సంకేతాలు ఆయన స్పష్టంగా ఇస్తున్నారు. జమున హ్యాచరీస్‌ ‌కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి భూమి ఆక్రమించినట్లుగా సమాచారం. మెదక్‌ ‌జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. అచ్చంపేట, హకీంపేట్‌ ‌గ్రామాల్లో ఈ భూ కబ్జా చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి భార్య జమున, కొడుకు నితిన్‌రెడ్డి పేరుతో అసైన్డ్ ‌భూములను రిజిస్టేష్రన్‌ ‌చేయించుకున్నారు. బాధిత బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు మంత్రి భూ కబ్జాపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రి ఈటల భూదాహాన్ని మెదక్‌ ‌జిల్లా రిటైర్డ్ ‌కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి వెలుగులోకి తెచ్చారు. మెదక్‌ ‌జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల కబ్జా ఫిర్యాదులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సీరియస్‌ అయ్యారు. తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌ ‌ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ ‌డీజీ పూర్ణచందర్‌ ‌రావుని సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జమున హ్యాచరీస్‌ ‌కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి మంత్రి ఈటల రాజేందర్‌ ‌వందల ఎకరాలు ఆక్రమించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈటల భూ ఆక్రమణలపై బాధిత రైతులు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు. తమ అసైన్డ్ ‌భూములను మంత్రి ఈటల రాజేందర్‌, ఆయన అనయాయులు ఆక్రమించుకుంటున్నారంటూ లేఖ ద్వారా బాధిత రైతులు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.