మాస్క్ లేకుంటే జరిమానా..!

  • ర్యాలీలకు,ఉత్సవాలకు అనుమతి లేదు..
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ఉన్నతాధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వ్యులను జారీ చేసింది.నెల రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ ఆదేశించింది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ర్యాలీలు, ఒకేచోట ప్రజలు గుంపులుగా ఉండటంపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్‌ 30‌వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని ఉత్తర్వ్యులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, స్థలాలు, పార్కుల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని వివరించింది. హోలి, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్‌ ‌జయంతి, గుడ్‌ ‌ఫ్రైడే, రంజాన్‌ ‌తదితర సందర్భాల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరాదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు విధిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ ‌కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.