‘బంద్‌’ ‌ప్రశాంతం…

  • ఏపీ•లో భారత్‌ ‌బంద్‌ ‌సంపూర్ణం
  • ఉదయం నుంచే లెఫ్‌ ‌పార్టీల ఆందోళన
  • కేంద్రానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసన ర్యాలీలు
  • డిపోలకే పరిమితం అయిన బస్సులు
  • నిలిచిపోయిన రవాణా సౌకర్యాల

అమరావతి,జ్యోతిన్యూస్‌ :

‌మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సాగు చట్టాలు, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్‌కు ఎపిలో మంచి స్పందన కనిపించింది. అందులో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రయివేటీకరణను, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ‌కొనసాగింది. తెల్లవారుజాము నుంచే వామపక్ష నేతలు రోడ్లపై నిరసనలు తెలిపారు. బంద్‌ ‌పిలుపుతో వ్యాపార,వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రవాణా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌, ‌బిఎస్‌పి బంద్‌కు మద్దతివ్వడంతో ఆంధప్రదేశ్‌లో బంద్‌ ‌సంపూర్ణంగా కొనసాగింది. అన్ని జిల్లాల్లో ఆర్‌టిసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనసంచారం లేక ఆర్టీసీ బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. భారత్‌ ‌బంద్‌లో భాగంగా గొల్లపూడిలో టీడీపీ ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారత్‌ ‌బంద్‌ ‌కొనసాగుతోంది. వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛంధంగా బంద్‌కు మద్దతు తెలిపాయి. స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ, పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్‌ ‌చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక మూడు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కడుపు నింపే రైతన్నలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటతడి పెట్టిస్తున్నాయని టీడీపీ నేత దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కడగండ్ల పాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆ రైతుల కన్నీళ్లు సమాధి చేస్తాయని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల బతుకుల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. రైతులు నాలుగు నెలలుగా ధర్నాలు చేస్తున్నా కేంద్రం మొండి వైఖరితో ముందుకు వెళ్లడం దేశానికి ప్రమాదకరమని నాగరాజు తెలిపారు.
విశాఖలో బంద్‌ ‌సంపూర్ణం
విశాఖ నగరంలో బంద్‌ ‌ప్రశాంతంగా జరుగుతోంది. ధర్నాలు కొనసాగుతున్నాయి. బంద్‌లో భాగంగా మద్దెలపాలెం సెంటర్‌లో ప్రజాసంఘాలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైటర్స్ అకాడమి ఛైర్మన్‌ ‌రమణమూర్తి ఏబీఎన్‌ ఆం‌ధ్రజ్యోతితో మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని, ఇది ప్రజల నిర్ణయమని అన్నారు. ఇవాళ బంద్‌లో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొన్నారని, వారికి స్టీల్‌ ‌ఫ్యాక్టరీతో సంబంధం లేకపోయినా.. విశాఖ ఉక్కు మనదని.. దీన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతో బంద్‌లో పాల్గొన్నారని చెప్పారు. కేంద్రం దిగొచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే విశాఖ గాజువాకలో కూడా బంద్‌ ‌కొనసాగింది. తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు భారత్‌ ‌బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు మద్దతుగా గాజువాకలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రోడ్లపైకి బస్సులు రానున్నాయి. కాగా ఆంధప్రదేశ్‌లో బంద్‌కు ప్రభుత్వం మద్దతు తెలపడంతో ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బంద్‌ ‌ప్రశాంతంగా జరుగుతోంది.