ఉద్యోగులకు శుభవార్త….!!

  • తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ‌బొనాంజా
  • 30శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తూ అసెంబ్లీలో కీలక ప్రకటన
  • ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు
  • రిటైర్మెంట్‌ ‌గ్రాట్యుటీ 12 లక్షలనుంచి 16 లక్షలకు పెంపు
  • అన్నిరకాల ఉద్యోగులకు పిఆర్సీ వర్తించేలా ప్రకటన

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
ఆలస్యంగా అయినా బొనాంజా దక్కింది. ఊహించిన దానికి మించిన వరాలు ప్రకటించారు. తాను ఉద్యోగ పక్షపాతినని మరోమారు నిరూపించుకున్నారు. కరోనా కారణంగా ఆలస్యమైనా…ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా ఇచ్చిన హా మేరకు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ‌ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని స్పష్టం చేశారు. రిటైర్మెంట్‌ ‌గ్రాట్యుటీని కూడా 12 లక్షలనుంచి 16 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సోమవారం శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పీఆర్సీపై ప్రకటన చేశారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ ఉత్తర్వులు ఏప్రిల్‌ 1, 2021 ‌నుంచి అమల్లోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రమోషన్ల పక్రియ చేపట్టి.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఔట్‌ ‌సోర్సింగ్‌, ‌కాంట్రాక్ట్, ‌హోంగార్డులకు, వీఆర్‌ఏ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. కరోనా వల్ల ఈసారి వేతన సవరణ ఆలస్యమైందన్నారు. ఉద్యోగుల వేతన సవరణ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటున్నామని చెప్పారు. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించింది. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీ యమైనది అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడిందన్నారు. టిఎన్జీవో అన్న పదమే తెలంగాణ అస్తిత్వానికి కారణమన్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో స్ఫూర్తి మరువలేనిది అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు చేసిన పోరాటం మరువలేదనిదన్నారు. నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా అండగా నిలిచారని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు మమత, మామిళ్ల రాజేందర్‌ ‌తదితరులతో తాను పలుదఫాలుగా చర్చించిన అనంతరం ఓ నిర్ణయానికి వచ్చానని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా ఆలస్యం అయ్యిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని ఆయన అన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్‌ ‌పక్రియ పూర్తి అయ్యిందన్నారు. వెంటనే అంతర్‌ ‌జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు. పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.