పదును పెట్టండి
- ఇండియా వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్
- ఆరోగ్య రంగంలో మన సామర్థ్యంపై ప్రపంచానికి విశ్వాసం
- ఐఐటి అంటే ఇండియన్ ఇండీజినస్ టెక్నాలజీ
- ఖరగ్‌పూర్ ఐఐటి స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
కరోనా కట్టడికి మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను మనం అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి తరహాలో భవిష్యత్‌లో పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో చేపట్టిన చర్యల అమలుపై ప్రధాని మోదీ మంగళవారం ఓ వెబినార్‌లో మాట్లాడారు. కరోనా అనంతరం ఆరోగ్య రంగంలో మన సామర్థ్యం పట్ల ప్రపంచానికి విశ్వాసం ఇనుమడించిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆరోగ్య రంగానికి అసాధారణంగా బడ్జెట్ కేటాయింపులుండటం ఈ రంగం పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్-19 వంటి పలు సవాళ్లను ఎదుర్కొనేలా కరోనా వైరస్ మనకు ఓ గుణపాఠం నేర్పిందని చెప్పారు. వైద్య పరికరాల నుంచి మందుల వరకూ, వెంటిలేటర్ల నుంచి వ్యాక్సిన్ల వరకూ..శాస్త్రీయ పరిశోధనల నుంచి ఆరోగ్య మౌలిక సదుపాయాల వరకూ భారత్ భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్య ఎమర్జెన్సీనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని అన్నారు. ఇకపోతే ఐఐటీ ఖరగ్‌పూర్ 66వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. 21వ శతాబ్దంలో భారత్ చాలా మారిందన్నారు. ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదు అని, అవి ఇన్స్‌టిట్యూట్స్ ఆఫ్ ఇండీజీనస్ టెక్నాలజీలుగా మారాలని అని మోదీ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన, నిస్వార్థం ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టి, భవిష్యత్తుకు అవసరమైన రీతిలో తయారుకావాలన్నారు. పదేళ్ల తర్వాత అవసరం వచ్చే అంశాలను ఆవిష్కరించాలన్నారు. సమస్యలను అర్థం చేసుకుంటే.. దీర్ఘకాలిక పరిష్కారాలు దొరుకుతాయన్నారు. అర్థం చేసుకునే తత్వం వల్లే.. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. వైఫల్యాలే శాస్త్రవేత్తలకు కొత్త దారులు కల్పించాయని, విజయానికి అవే బాటలు వేశాయన్నారు. 21వ శతాబ్దంలో భారత్ ఆశయాలు, అవసరాలు మారినట్లు ఆయన వెల్లడించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. విద్యాశాఖ సహకారంతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశామన్నారు. భారతదేశ భవిష్యత్తు కోసం సైన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టమంటూ మోదీ చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకునే డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతికతకు, ఆరోగ్య సంరక్షణకు మధ్య అనుసంధానంగా ఈ ఆసుపత్రి పనిచేస్తుందని అధికారులు చెప్పారు.