సిబిఐకి అప్పగించాలి
- లాయర్ జంట హత్యకేసును సిబిఐకి అప్పగించాలి
- అక్రమాలపై పోరాడుతున్నందుకే దంపతులను పొట్టనపెట్టుకున్నారు
- ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రేరేపించడం వల్లే న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య జరిగిందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నడిరోడ్డుపై పట్టపగలే వామనరావు దంపతులను హత్య చేశారని మండిపడ్డారు. వామనరావు దంపతుల హత్య కేసులో టీఆర్‌ఎస్ నేతలు పుట్టా మధు, కుంట శ్రీను పాత్రధారులు మాత్రమేనని చెప్పారు. వామనరావు హత్య కేసులో కేసీఆర్, కేటీఆర్, బాల్కసుమన్‌లను చేర్చాలని డిమాండ్చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే చంపేస్తామని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హాలియా సభలో ప్రతిపక్షాలను తొక్కేస్తామన్నారన్నారు. టీఆర్‌ఎస్ నేతల అక్రమాలపై వామనరావు దంపతులు కేసులు వేసి పోరాడుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు, నాగమణి హత్య దారుణంగా హత్య చేశారు. కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను దుండగులు మరో కారులో వచ్చి అడ్డుకున్నారు.. కారులోంచి న్యాయవాదిని బయటకు లాగి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. కారులో ఉన్న ఆయన భార్యపైనా కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. ప్రముఖులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ’నచ్చితే నజరానా లేదంటే జరిమానా’ అన్న విధంగా వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన లేకపోతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నా భద్రత విషయంలో కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రఘురామకృష్ణంరాజు, పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు కేంద్రం భద్రత ఇచ్చినప్పుడు, నా విషయంలో ఎందుకు పక్షపాతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్ద, ఆయన కుమారుడు హత్య రాజకీయాలపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. న్యాయవాద దంపతుల హత్యలను దేశం మొత్తం గమనిస్తుందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ నాయకుల చేతులలో న్యాయవాద దంపతులు హత్యగావించబడ్డారని వారు ప్రభుత్వ ఆరాచకాలను అనేక విధానాల ద్వారా ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై దాడులు చేయాల్సిందిగా, ఒక శాసన సభ్యుడిగా బాల్కసుమన్ తన నియోజకవర్గ కార్యకర్తలను రెచ్చగొట్టాడన్న ఆయన న్యాయవాద దంపతుల హత్యకు ఎవరిది భాధ్యత ? అని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ , కేటీఆర్ , బాల్కసుమన్ లు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల కింది స్థాయి కార్యకర్తలు దాడులు, హత్యలు చేస్తున్నారని, హత్యకు గురైన న్యాయవాది వామనరావు రక్షణ కావాలని కోరినా, పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. హత్యకేసును స్థానిక పోలీసులు సరిగా విచారణ చేయలేరు, న్యాయం జరగదని అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ హత్య కేసులో కేసీఆర్ , కేటీఆర్ , బాల్కసుమన్ లను చేర్చాలని అన్నారు. అలానే న్యాయవాది వామన్ రావు, నాగమణి లు వాదిస్తున్న కేసులను సీబీఐ విచారణ చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తుందన్న రేవంత్ కేంద్ర హోం శాఖ ఈ హత్య కేసును తక్షణమే సీబీఐ విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు.