వీడియో తీయాల్సిందే…

  • పంచాయితీ ఓట్ల లెక్కింపు చిత్రీకరణ
  • ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
  • నేటి మూడో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
ఏపీ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వన్ని వీడియో తీయాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో చిత్రీకరణ చేయాలన్న పిటిషన్‌పై మంగళవారం విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్‌ ‌పర్వాన్ని వీడియో తీయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ఇప్పుడు హైకోర్టు స్పష్టం చేసింది.పిటిషనర్‌ ‌తరఫు సీనియర్‌ ‌న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ ‌వాదనలు వినిపించారు. కౌంటింగ్‌ ‌నిష్పక్షపాతంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీలో ఉండే ఓటరు ఎవరైనా వీడియో షూట్‌ ‌చేయాలని కోరితే వెంటనే కౌంటంగ్‌ను చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ షాకులు చెప్పొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. వీటిలో 579 ఏక గ్రీవాలు కాగా… ఫిబ్రవరి 17న 2,640 సర్పంచ్‌.. 19,607 ‌వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నాలుగవ విడత నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. 3 గంటల తరవాత అభ్యర్థుల తుది జాబితాను ఎస్‌ఈసీ ప్రకటించనుంది. ఫిబ్రవరి 21న పోలింగ్‌
‌నిర్వహించున్నారు.