లోయలో పడిన బస్సు..!
- 19 మందికి గాయాలు
- అరకు ఘాట్ రోడ్డులో ప్రమాదం
- హైదరాబాద్‌కు చెందిన ప్రయాణీకులుగా గుర్తింపు
విశాఖపట్నం,జ్యోతిన్యూస్ :
విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 4 మంది మృతి చెందారు. 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అయిదో నంబర్ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలో పడింది. ఈ బస్సులో దాదాపు 25 నుంచి 30 మంది ప్రయాణీకులు ఉంటారని తెలుస్తోంది. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 19 మందికి గాయాలైనట్లు అనంతగిరి పోలీసులు తెలిపారు.ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బం ది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయిదుగురు చిన్నారులు సహా 12 మందిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది క్షతగాత్రులను అనంతగిరి, కేజీహెచ్ ఆస్పత్రులకు తరలించారు.
ఈ బస్సు దాదాపు 80 అడుగుల లోతులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన ఈ బస్సు హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన దినేశ్ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా అనుమనిస్తున్నారు. పూర్తిగా చీకటి పడటంతో సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. బాధితులంతా శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి అరకు వచ్చి.. అరకు నుంచి తిరిగి వెళ్తుండగా లోయలోకి బస్సు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. అరకులో బస్సు ప్రమాద ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. సీఎంవో అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ స్పందిస్తూ అరకు లోయలో ప్రమాదం జరిగిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అరకు లోయ మార్గంలో డుముకు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ,ఏపీ రాష్ట్రాల గవర్నర్లు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందిం చారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అరకు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.