పల్లె‘పోరు’…
- ఏపిలో ముగిసిన రెండో విడత పంచాయితీ పోలింగ్
- రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్ నమోదు
- వెనువెంటనే కౌంటింగ్ పక్రియ
అమరావతి,జ్యోతిన్యూస్ :
ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడుత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఉన్న 167 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,768 సర్పంచ్ స్థానాలకు, 20 వేల 817 వార్డు మెంబర్ల స్థానాలకు ఇవాళ ఎన్నికల పోలింగ్ జరిగింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీసీ వర్గాల మధ్య పలుచోట్ల ఘర్షణలు, చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొదటి దశలో మాదిరిగానే రెండో దశ పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 3.30 వరకు క్యూలైన్ లో వేచి ఉన్న వారందరూ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం 72.87, విజయనగరం 82, విశాఖ 84.94,తూ.గో. 82.86, ప.గో.81.75, కృష్ణా 84.14, గుంటూరు 85.51, ప్రకాశం 86.93, నెల్లూరు 78.04, చిత్తూరు 77.20, వైఎస్‌ఆర్ జిల్లా 80.47, కర్నూలు 80.76, అనంతపురం 84.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే 539 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వల్లూరు పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ హరికిరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యూలైన్‌లో ఓటర్ల వద్ద ఓటర్ స్లిప్‌లను పరిశీలించారు. కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన కేంద్రాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ పక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ పక్రియను జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాసీం సాహెబ్ పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కృష్ణా జిల్లా:గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా రెండో విడత పోలింగ్ పక్రియను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలిస్తున్నారు. ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఉదయం.. గుడ్లవల్లేరు, ముదినేపల్లి, గుడివాడ మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా ప్యటించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం క్రమేసీ పెరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్ నమోదయిందన్నారు. 9 వేల పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మ క ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో స్వల్ప సమస్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలీసు బలగాలను మొహరించడంతోపాటు.. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఊరేగింపులు, విజయోత్సవాలు, బాణ సంచా కాల్చడంపై నిషేధం విధించడంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు కూడా పరిమిత స్థాయిలో అభ్యంతరాలకు అవకాశం లేని రీతిలో సంబరాలు చేసుకుంటున్నారు.