ఏపీకి రూ 280.76 కోట్లు

  • విపత్తు నిధుల కింద కేంద్ర సాయం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(ఆర్‌ఎన్‌ఎ):
‌కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ హెచ్‌ఎల్‌సీ ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ‌కింద అదనపు కేంద్ర సహాయాన్ని ఆమోదించింది. 2020లో వరదలు, తుఫాను, తెగులు దాడి వలన ప్రభావితమైన రాష్ట్రాలకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్‌ ‌కూడా ఉంది. జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి నుంచి నాలుగు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతానికి రూ.3,113.05 కోట్ల అదనపు కేంద్ర సహాయాన్ని హెచ్‌ఎల్‌సీ ఆమోదించినట్లు కేంద్రం శనివారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా నష్టపోయిన ఆంధప్రదేశ్‌కు రూ.280.76 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌లో తెగులు కారణంగా నష్టపోయిన మధ్యప్రదేశ్‌కు అత్యధికంగా రూ.1,280 కోట్లు కేటాయించింది. బిహార్‌కు రూ.1,255.27 కోట్ల ఇవ్వనుంది. ఈ ఏడాది నివర్‌, ‌బురేవి తుపానుల బారినపడ్డ తమిళనాడుకు రూ.63.14 కోట్లు (నివర్‌), ‌రూ.223.77 కోట్లు (బురేవి) కేటాయించింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రూ.9.91 కోట్లు ఇచ్చేందుకు ఆమోదించింది.