సహనాన్ని పరీక్షించొద్దు…!

  • తగిన సమయంలో బిజెపికి బుద్ది చెబుతాం
  • చిన్నిచిన్న విజయాలకే ఎగిరెగిరి పడితే ఎలా
  • మా ఓపికకూ ఓ హద్దుంటుందని గుర్తుంచుకోండి
  • బండి సంజయ్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు
  • తెలంగాణ కోసం ఎత్తిన జెండా దించని నేత కేసీఆర్‌
  • ‌సిరిసిల్లలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

‌రాజన్న సిరిసిల్ల,జ్యోతిన్యూస్‌ :
‌చిన్నచిన్న విజయాలకే ఎగిరెగిరి పడుతున్న బీజేపీ నేతలకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. సహనాన్ని అసమర్థతగా భావిస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్‌, ‌తెలంగాణ బీజేపీ ఏర్పడ్డాయంటే అది కేసీఆర్‌ ‌భిక్ష అని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రు. నాటి ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఉందన్న విషయాన్ని బీజేపీ నాయకులు మరిచి పోవద్దన్నారు. అవసరమైతే ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కూడా వదిలిపెట్టాం. మాటలు మాట్లాడే పరిస్థితి వస్తే.. తాము కంటే ఎక్కువగా మాట్లాడుతామని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. చూస్తు ఊరుకోమని మంత్రి కేటీఆర్‌ ‌హెచ్చరించారు. ఓపికకు హద్దులుంటాయని.. హద్దు దాటి మాట్లాడవద్దని కేటీఆర్‌ అన్నారు. తాము తిరగబడితే ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను ఉరికించామని కేటీఆర్‌ అన్నారు. ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్‌ల బతుకెంత అని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్‌ ‌నేతలు పారిపోయారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌నేతలు నోటికొచ్చినట్టు సీఎం కేసీఆర్‌పై మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ ఒక్క సీటు గెలిచి ఎగిరిపడుతోందని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌రెచ్చగొట్టడం తప్పితే.. ఆయనతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని కేటీఆర్‌ ‌చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ‌హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ 20 ఏండ్లలో అనేక ఘటనలు చూశాం. అన్ని పరిస్థితులను నిలదొక్కుకొని ఈ స్థాయికి వచ్చామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ ‌నిలబెట్టారు అని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌.. ‌జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌ ‌పరిపాలనాదక్షుడు అని కేంద్రమంత్రులే చెప్పారు. వందశాతం సాగు, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం చెప్పిందన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ 9 ‌గంటల కరెంట్‌ అని చెప్పి.. ఏ ఒక్క రోజు కూడా 6 గంటల కరెంట్‌ ‌కూడా ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి కరెంట్‌ ఇచ్చి రైతుల ప్రాణాలతో చెలగాటమాడారు అని ధ్వజమెత్తారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రమే అని తేల్చిచెప్పారు. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరుతుంద న్నారు. రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, రైతు బంధు అందుతోందని గుర్తు చేశారు. తెలంగాణలో మాదిరిగా ఇతర రాష్టాల్లో్ర 24 గంటల ఉచిత విద్యుత్‌ ఉం‌దా అని కేటీఆర్‌ ‌నిలదీశారు. ప్రతి గ్రామంలో అందర్నీ కలుపుకుని పోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అందరి పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో అగ్రభాగాన ఉండాలని స్థానిక కార్యకర్తలకు కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో రెచ్చగొట్టే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.