అంతా సిద్ధం…

  • ఎపిలో నేడు రెండోవిడత పంచాయితీ ఎన్నికలు
  • 18 రెవెన్యూ డివిజన్లలో 3,328 గ్రామపంచాయతీలకు పోలింగ్‌
  • ఇప్పటికే 539 సర్పంచ్‌ ‌స్థానాలు ఏకగ్రీవం
  • 2,789 సర్పంచ్‌ ‌స్థానాలకు శనివారం పోలింగ్‌
  • ‌భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
ఏపీలో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ‌జరుగుతుంది. అరగంట విరామం తర్వాత సాయంత్రం 4 గంటలకు నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల పర్యవేక్షణకు ఆయా జిల్లాల్లో ఎన్నికల కమిషన్‌ ‌పరిశీలకులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు ఎన్నికల పోలింగ్‌ ‌విధులకు టీచర్లకు డ్యూటీ వేశారు. ఆయా మండల కేంద్రాల్లో మధ్యాహ్నం నుండి పోలింగ్‌ ‌సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేసారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో 3,328 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 539 సర్పంచ్‌ ‌స్థానాలు ఏకగ్రీవం అవ్వగా 2,789 సర్పంచ్‌ ‌స్థానాలకు శనివారం పోలింగ్‌ ‌జరగనుంది. సర్పంచ్‌ ‌స్థానాలకు నామినేషన్లు వేసిన 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇదిలావుంటే రెండో దశ పంచాయతీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామని పంచాయతీరాజ్‌ ‌ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేది ప్రకటించారు. రెండో దశలో 3,328 పంచాయతీల్లో 539 ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. 33,570 వార్డు స్థానాల్లో 12,604 ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. రెండో దశ ఎన్నికలకు 29, 304 పోలింగ కేంద్రాలు ఏర్పాటు చేశామని ద్వివేది తెలిపారు. 5,480 సమస్యాత్మక పోలింగ్‌ ‌కేంద్రాలు గుర్తించామన్నారు. 4,181 అతి సమస్యాత్మక పోలింగ్‌ ‌కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. 47,492 మంది సిబ్బందితో రెండో దశ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలింగ్‌, ‌లెక్కింపు కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ద్వివేది పేర్కొన్నారు. రెండోవిడత జరగనున్న పంచాయతీ పోలింగ్‌ ‌ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ ‌కేంద్రాలలో వెబ్‌ ‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌, ‌కౌంటింగ్‌ ‌పర్యవేక్షణకు ప్రతి మూడు మండలాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు అధికారులు చెప్పారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ‌విధులకు ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల పోలింగ్‌ ‌సిబ్బంది గైర్హాజరు అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది అనారోగ్య కారణాలతో అనుమతి తీసుకున్నారు. మరికొంత మంది ఎలాంటి అనుమతి తీసుకోకుండా డుమ్మా కొట్టినట్లు తేలింది. దీంతో ప్రత్యమ్నాయంగా ఉన్న వారికి పోలింగ్‌ ‌బాధ్యతలు అప్పగించారు. అనుమతి తీసుకోకుండా గైర్హాజరైన పోలింగ్‌ ‌సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. డుమ్మాకొట్టిన వారి వివరాలను ఆయా మండలాల ఎంపిడిఓలు నుండి వెంటనే తెప్పించుకుని సస్పెన్షన్‌ ఆర్డర్స్ ‌జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు. బరిలో నిలిచిన అభ్యర్థులు నాలుగు రోజులపాటు ప్రచారం చేసుకున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చూపించి మరీ ప్రచారం చేసుకున్నారు. బ్యాలెట్‌ ‌పేపర్లలో అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో మొదటి దశలో పలు ప్రాంతాల్లో గందరగోళం చెలరేగింది. ఈ విషయాన్ని గుర్తించిన రెండో విడతలో పోటీ చేసే అభ్యర్థులు తమ గుర్తులను ఓటర్ల వద్దకు తీసుకుని వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసుకున్నారు. బ్యాలెట్‌ ‌పేపర్లలో పేరు ఉండదని.. కేవలం గుర్తును చూసి మాత్రమే ఓటు వేయాలని.. బ్యాలెట్‌ ‌పత్రంలో వరుస సంఖ్యలో తమ గుర్తు ఎక్కడ ఉందో చూపించి మరీ ఓటర్లను అభ్యర్థించారు.
…………………………