రైతు హితమే…

  • – కరోనా కష్టాల్లోనూ సత్తాచాటిన కర్షకులు
  • – దేశంలో రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తి
  • – వారు దేశానికి వెన్నముక..వారి సంక్షేమానికి పెద్దపీట
  • – చౌరీచౌరా శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
కరోనా సంక్షోభ వేళ కూడా భారత్‌ రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. పంట పండించేవాళ్లే దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక అని ఆయన అన్నారు. యూపీలోని చౌరీ చౌరా శతాబ్ది వేడుకలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఆ తర్వాత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రగతిలో రైతుల భాగస్వామ్యం ఎప్పుడూ ఉన్నదని, చౌరీ చౌరా ఉద్యమంలోనూ వారి పాత్ర కీలకంగా ఉందని, గత ఆరేళ్ల నుంచి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, రైతులను స్వయం సమృద్ధి చేసేదిశగా అడుగులు వేశామని, దీని వల్లే కరోనా మహమ్మారి వేళ కూడా వ్యవసాయం రంగం వృద్ధి చెందినట్లు మోదీ తెలిపారు. రైతుల పురోగతి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను మోదీ వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, మండీల ద్వారా రైతులు లబ్ది పొందేందుకు.. మరో వెయ్యి మండీలను ఈ-నామ్‌కు లింకు చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశ స్వాతంత్య సమరంలో కీలకమైన ‘చౌరీ చౌరా’ ఘటన జరిగి వచ్చే ఏడాదికి వందేళ్లు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి ఏడాది పాటు కార్యక్రమాలు చేపట్టనుంది. యూపీలోని గోరఖ్‌పుర్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చౌరీ చౌరా’ ఘటన అంటే పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టడం మాత్రమే కాదు. దీంట్లో పెద్ద సందేశం ఇమిడి ఉంది. ప్రజల గుండెల్లో అగ్నిజ్వాలకు నిదర్శనం ఆ ఘటన. అయితే, దురదృష్టవశాత్తూ దీని గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడరు. చరిత్ర పుటల్లోనూ దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, ఈ మట్టిలో కలిసిపోయిన ‘చౌరీ చౌరా’ ఉద్యమకారుల రక్తం.. మనలో ఎప్పటికీ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుందని మోదీ చెప్పుకొచ్చారు. దేశ అభివృద్ధికి రైతులే కారణమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ‘చౌరీ చౌరా’ పోరాటంలోనూ అన్నదాతలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రైతుల స్వావలంబనే తమ ప్రభుత్వ ధ్యేయమని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు గత ఆరేళ్లుగా పలు చర్యలు చేపట్టామని తెలిపారు. మండీలు లాభదాయకంగా ఉండాలని, 1000కి పైగా మండీలను ఇ-నామ్‌కు అనుసంధానించినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యల వల్లే మహమ్మారి కాలంలోనూ వ్యవసాయ రంగం వృద్ధి సాధించిందని తెలిపారు. ‘చౌరీ చౌరా’ ఘటనకు వందేళ్లను పురస్కరించుకుని కార్యక్రమంలో ప్రత్యేక తపాలా బిళ్లను మోదీ విడుదల చేశారు. స్వాతంత్య ఉద్యమంతో సంబంధం ఉన్న 99 మందిని ఇందులో సత్కరించనున్నారు. 1922 పిబ్రవరి 4న చౌరీ చౌరాలో ఉద్యమకారులపై బ్రిటిష్‌ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యమ కారులు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు చౌరీ చౌరా పోలీస్‌ పోస్టులకు నిప్పుపెట్టారు. ఈ అల్లర్లలో 24 మంది పోలీసులు చనిపోయారు. ఈ ఘటనతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. అమరులను స్మరించుకుంటూ యూపీ ప్రభుత్వం ఈ శతాబ్ది కార్యక్రమాలను చేపట్టింది.