పైసా ఇయ్యలే…!
- – కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు
- – రాష్ట్ర ఆదాయం రూ.52,750 కోట్లు తగ్గుతుందని అంచనా
- – ఆర్థికశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
ఇటీవల హైదరాబాద్‌లో కకురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్షించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణా రావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అనే విషయంలో మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి అన్నా రు. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించక పోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైద రాబాద్ నగరానికి నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తాయి. దీనివల్ల అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు రూ.5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. కేంద్ర బందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’ అని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి 39,608 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు రూ.33,704 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కానీ, కరోనా వల్ల పెరగాల్సిన 15 శాతం పెరగక పోగా, గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం 67,608 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ కేవలం రూ.33,704 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.33,904 కోట్లు తగ్గనుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,025 కోట్లు తగ్గాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 9,725 కోట్ల రూపాయలకు గాను, 8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో 802 కోట్ల రూపాయలు కోత పడే అవకాశం ఉంది. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయస్థాయి సినిమా సిటీ నిర్మిస్తాం :కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయస్థాయిలో సినిమా సిటీ నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్ నగర శివారులో 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రముఖులు, అధికారుల బందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలల్సిందిగా సూచించారు. సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయినందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించవచ్చన్నారు. సినీరంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ లో సినిమా పరిశ్రమ అభివద్ధి- విస్తరణపై చర్చ జరిగింది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకష్ణ రావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నేపథ్యలో విధించిన లాక్ డౌన్ వల్ల అటు షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివద్ధి- విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినైనా ఒడిలో చేర్చుకునే గుణం ఉంది. షూటింగులతో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం పేర్కొన్నారు. నటులు చిరంజీవి, నాగార్జున మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగులు ప్రారంభించామన్నారు. త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.