గెలవాలి…🏆
- – రెండు పట్టభద్ర ఎమ్మెల్సీలు మనమే గెలవాలి
- – ఓటు నమోదులో చురకుగా వ్యవహరించాలి
- – పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలవాలని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అంత ఈజీగా తీసుకోవద్దని హెచ్చరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరు జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైనారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు నమోదులో ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. 2014 తర్వాత డిగ్రీ పూర్తయిన యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని, ఉద్యోగులు, యువత టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే.. విమర్శకుల నోళ్లు మూయించాలని చెప్పారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంతోపాటు పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం కావాలన్నారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, కేంద్రం తీరు, రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు పక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. సరైన అవగాహన, చైతన్యం లేక అనేకమంది గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవడంలేదు. వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా టీఆర్‌ఎస్ నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లోనూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం తేవాలని సీఎం సూచించారు. ధరణి వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్కరూ ఆస్తులు అధికారులకు తెలిపేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కేసీఆర్ పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ రామచంద్రరావు కొనసాగారు. వారి పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు పక్రియ కూడా మొదలైంది.