మహిళలకు’బతుకమ్మ’ చీరలు

  • – బతుకమ్మ చీరల ప్రదర్శనను ప్రారంభించిన కేటీఆర్‌
  • – వచ్చేనెల 9నుంచి మహిళా సంఘాల ద్వారా చీరెల పంపిణీ
  • – ఏ క్షణమైనా గ్రేటర్‌ ఎన్నికలు వచ్చే అవకాశం
  • – అందరూ సన్నద్దంగా ఉండాలి
  • – కొందరు కార్పొరేటర్ల పనితీరుపై అసహనం
  • – ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌లతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :
కరోనా లాంటి సంక్షభంలోనూ తెలంగాణలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగలేదని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రైతులకు మొదలు చేనేత వరకు అందరికి డబ్బులు అందాయన్నారు. ప్రభుత్వానికి మతాలతో సంబంధం లేదని అందరి పండగలకు చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. చేనేతను ఆదుకునేందుకు బతుకమ్మ చీరలు ఎంతగానో దోహదపడు తున్నాయన్నారు. నగరంలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్‌ ప్రారంబించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను మరమగ్గాలపై తయారు చేశారు. ఈ ఏడాది 287 విభిన్నమైన డిజైన్స్‌లలో బతుకమ్మ చీరలు సిద్ధంగా ఉన్నాయి. బంగారు, వెండి జరీ అంచులతో పాలిస్టర్‌ పిలిమెంట్‌ నూలు చీరలను తయారీ చేశారు. దాదాపు రూ.317.81 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చీరలను తయారు చేయించింది. కోటికి పైగా చీరలను పంపిణీ చేయనున్నా రు. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలు చేరాయి. అక్టోబర్‌ రెండో వారంలో తెలంగాణ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయనున్నారు. కరోనా కారణంగా మహిళాసంగాల ద్వారా వీటిని పంపిణీ చేయిస్తామని కెటిఆర్‌ అన్నారు. అధికారి శైలజా అయ్యర్‌ ప్రత్యేక శ్రద్దతో డిజైన్లు చేయించారని అభినందించారు. బతుకమ్మ పండుగకు చిరు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అక్కాచె/-లలెళ్లకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్‌ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి బతుకమ్మ ప్రారంభం కాబోతోంది. కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని తెలిపారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారు. రూ. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. ఉద్యమ సమయంలోనే నేతన్నల కష్టాలను స్వయంగా చూశారు. ఒక్క నెలలో ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం చూసి ఆయన చలించిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారు. నేతన్నలకు పని కల్పించి వారికి ఆదాయం పెంచాలని సీఎం భావించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 1200 కోట్ల రూపాయాల బడ్జెట్‌ను చేనేత జౌళి శాఖకు కేటాయించారు. పవర్‌ లూమ్స్‌కు చేతి నిండా పని కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది కోటి చీరలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. 2017లో 220 కోట్ల రూపాయాలు, 2018లో 280 కోట్ల రూపాయాలు, 2019లో 313 కోట్లు, 2020లో 317.81 కోట్లు బతుకమ్మ చీరలకు వెచ్చిస్తున్నామని చెప్పారు. 26 వేల పవర్‌ లూమ్స్‌కు పని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. ఒక్క బతుకమ్మ చీరలకే రూ. 1033 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ నాలుగేళ్లలోనే నాలుగు కోట్ల చీరలను పంపిణీ చేసింది. 30 లక్షల విూటర్ల గుడ్డను ఉత్పత్తి చేయడం జరిగింది. ప్రభుత్వ స్కూల్‌ యూనిఫాం కూడా పవర్‌ లూమ్స్‌ ద్వారానే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీలు, ఇతర ఐసీడీఎస్‌ సిబ్బందికి చెందిన చీరలు, కేసీఆర్‌ కిట్‌లో ఇచ్చే చీరలను కూడా పవర్‌ లూమ్స్‌ ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో నేతన్నల ఆత్మహత్యలు లేవు. రైతు, నేతన్న ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది అని పేర్కొన్నారు. నేతన్న భవిష్యత్‌ భద్రంగా ఉంటుందన్నారు. బతుకమ్మ పండుగకే కాదు, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు కూడా చీరలు పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.
ఏ క్షణమైనా గ్రేటర్‌ ఎన్నికలు వచ్చే అవకాశం
గ్రేటర్‌ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలని మంత్రి కెటిఆర్‌ పార్టీ నేతలను ఆదేశించారు. నవంబర్‌లోగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. మంగళవారం నాడు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. జీహెచ్‌ఎంసీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్పొరేటర్లు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిట్టింగ్‌ కార్పొరేటర్ల పని తీరుపై కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని.. పని తీరు మార్చు కోవాలని ఆయన ఒకింత హెచ్చరించారు. సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి కి ఇప్పటికి 60వేల కోట్ల రూపాయలు వెచ్చించామన్న కేటీఆర్‌.. కార్పోరేట్‌ లకు ఇంకా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టి కి తీసుకురావాలని చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని తెలియజేయాలని సూచించారు. ప్రతి కార్పోరేటర్‌ 3 వేల గ్రాడ్యుయేట్‌ ఓట్లు నమోదు చేయించాలని, అక్టోబర్‌1 న ప్రజాప్రతినిధులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలో గత ఐదేండ్లుగా జరిగిన అభివృద్ధి గురించి ఒక ప్రగతి నివేదికను రూపొందించి విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం గత ఐదేండ్లుగా హైదరాబాద్‌ నగరానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీర్‌ చెప్పారు. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించడంతోపాటు వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి పరచిందని తెలిపారు. అంతేగాక లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించిందన్నారు. హైదరాబాద్‌ నగరంలో వివిధ కార్యక్రమాల కోసం ఐడేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని చెప్పారు. గత ఐదేండ్లుగా హైదరాబాద్‌ నగరంలో చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, మౌలిక వసతులకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకచోట చేకూర్చి ప్రగతి నివేదిక విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ప్రగతి నివేదిక తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉండబోతుందని చెప్పారు. జీహెచ్‌ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్పొరేటర్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్‌ కోరారు. రిజిస్టేష్రన్లు, ఆస్తులపై హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. స్థిరాస్తుల పైన యాజమాన్య హక్కులు కల్పించడానికి చేపట్టే పక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందన్నారు. ఇక, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు
సంబంధించి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. హైదరాబాద్‌ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని మరింత పెంచేందుకు, నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సీరియస్‌గా పనిచేయాలని నగర ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఇందులో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహ్మూద్‌ అలీ, తలసాని, మేయర్‌ బొంతు రామ్మోమన్‌ తదితరులు పాల్గొన్నారు.