ఇక సెలవు…. 🎼
- – గానగంధర్వుడి అంత్యక్రియలు పూర్తి
- – శాశ్వత నిద్రలోకి జారుకున్న మన బాలు
- – ప్రభుత్వ లాంఛనాలతో సొంత ఫామ్‌హౌజ్‌లో పూర్తి
- – వేలాదిగా తరలివచ్చిన సినీ అభిమానులు
చెన్నై,జ్యోతిన్యూస్ :
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చెన్నై శివారులోని పొంత ఫామ్‌హౌస్‌లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఖననం చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు. ఏపీ ప్రభుత్వ తరపున మంత్రి అనిల్ యాదవ్ హాజరై నివాళులు అర్పించారు. సినీ రంగం నుంచి విజయ్, భారతీరాజా, దేవీశ్రీప్రసాద్, మనో తదితరులు హాజరై అంతిమనివాళి అర్పించారు. పాటల పూదోటలో పుట్టి.. సుస్వర సంగీత మాలికలల్లి .. గాన సరస్వతి కంఠాని కలంకరించి .. సుమధుర గాన ఆంభృతపు జల్లులు కురిపిం చిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గంధర్వ లోకానికి పయనయమయ్యారు. అశృనయనాల మధ్య బాలు అంత్యక్రియలు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వహించారు. శ్రౌతశైవ ఆరాధ్య సంప్ర దాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంతకముందు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులు వైదిక క్రతువు పూర్తి చేశారు. భౌతికంగా బాలు మన మధ్య లేకపోయిన పాట రూపంలో ప్రపంచమంతటా ఆయన అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచి ఉంటారనేది అక్షరసత్యం. కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసారు . సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04ని.లకు ఎస్పీబీ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి యావత్ ప్రపంచాన్ని దిగ్భాంతికి గురి చేసింది. బాలు పార్ధీవ దేహాన్ని ముందుగా ఆయన కుమారుడు చరణ్ ఇంటికి తరలించగా, అక్కడకు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో రాత్రి 8గంటల ప్రాంతంలో ఫాంహౌజ్‌కు తరలించారు. ఫాం హౌజ్‌కు అభిమాన సంద్రం పోటెత్తింది. ముందుగా అభిమానులకు అనుమతినివ్వని పోలీసులు వారి ప్రేమని గుర్తించి భౌతిక దూరం పాటిస్తూ చివరి చూపు చూసేందుకు అనుమతినిచ్చారు. శివసాయుధ్యం పొంది న బాలుని చివరి చూపు చూసుకునేందుకు బంధువులు, ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు. ఆయన భౌతిక దేహాన్ని చూసి ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరయ్యారు. ఫాం హౌజ్ పరిసరాలన్నీ బాలు అభిమానులతో జన సంద్రం గా మారింది. శనివారం ఉదయం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. హీరో అర్జున్ మాట్లాడుతూ బాలుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని భాషలకు చెందిన ప్రముఖులు దీనిపై గట్టిగా మాట్లాడాలని అర్జున్ పేర్కొన్నారు. గాయకుడిగా ఎన్నో శిఖరాలని అధిరోహించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. ఆయనని కడసారి చూసేం దుకు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌కు వచ్చిన అర్జున్ నివాళులు అర్పించిన తర్వాత విూడియాతో మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలుగు, మలయాళ,తమిళం ఇండస్ట్రీలు అన్ని కలసి రావాలని, 45 వేల పాటలు రెండు జన్మలు ఎత్తిన పాడలేరు అని అర్జున్ పేర్కొన్నారు.