ఉచితంగా ‘బోర్లు’

– రైతులకు ఉచితంగా బోరుబావుల పథకం
– వైఎస్సార్‌ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు
– 28న ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
– రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు
– 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు
– పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హావిూ మేరకు అమలు
– శాస్త్రీయంగా భూగర్భజలాల లభ్యతపై అంచనా
– సమీక్షించిన సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
మరో సంక్షేమ పథకం కోసం ఎపిలో కార్యాచరణ చేపట్టారు. బోర్లు వేసుకునే రైతుల కోసం వైఎస్సార్‌ జల జలకళ పథకాన్ని సిఎం జగన్‌ ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు 28న సిఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌ వారికి అండగా నిలుస్తానని ఆనాడు హావిూ ఇచ్చారు. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పుల పాలవుతున్న వైనాన్ని గమనించిన వైఎస్‌ జగన్‌ రైతులు పడుతున్న అవస్థలను పూర్తిగా తొలగించేందుకు ఇచ్చిన హావిూ కార్యరూపం దాలుస్తోంది. ఆనాడు పార్టీ మేనిఫేస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్‌ పై ఇచ్చిన హావిూ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం వైఎస్సాఆర్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 28న ఈ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ దీనికోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్‌కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్‌ పిడి ఆయా దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్‌ డ్రిల్లింగ్‌ సైట్‌ లో బోరుబావులను తవ్వుతారు. బోరుబావుల సక్సెస్‌ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు జరుపుతారు. వైఎస్సాఆర్‌ జలకళ పథకం’ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఆ సాప్ట్‌వేర్‌ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత నుంచి దానికి అనుమతులు ఇవ్వడం, బోర్‌ బావి తవ్వకం, కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడం వరకు అత్యంత పారదర్శకతతో, నిర్ణీత సమయంలోనే పక్రియను పూర్తి చేస్తారు. ప్రతి దశలోనూ దరఖాస్తు చేసుకున్న రైతుకు తన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఎస్‌ఎస్‌ఎంల ద్వారా పంపిస్తారు. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కూడా తన దరఖాస్తు ఏ దశలో వుందో రైతు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు రైతు పొలంలో బోర్‌ డ్రిల్లింగ్‌ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్‌ డ్రిల్లింగ్‌ లో నీరు పడక విఫలం అయితే, మరోసారి బోర్‌ కోసం నిపుణుడైన జియోలజిస్ట్‌ నిర్ధేశిరచిన ప్రాంతంలో డ్రిల్లింగ్‌ చేసేందుకు అవకాశం కల్పించారు.