సరిహద్దులు దాటుతున్న సర్కారు బియ్యం.. | పినపాక

  • పేదోళ్ల రేషన్ బియ్యం మిల్లులకు తరలింపు
  • నెలనెలా కొందరు లబ్ధిదారుల రేషన్ ఎగవేత
  • సర్కార్ రేషన్ ను సన్నగా మార్చి విక్రయిస్తున్న రైస్ మిల్లర్లు
  • సివిల్ సప్లై అధికారుల తనిఖీలు శూన్యం.

పినపాక, జ్యోతి న్యూస్:
ప్రతి నిరుపేద కుటుంబం మూడు పూటలా నోట్లో ముద్ద పెట్టాలన్న లక్ష్యంగా
తెలంగాణ సర్కార్ అందిస్తున్న ఆహారభద్రత పథకం లక్ష్యం నీరుగారుతోంది.
కుటుంబంలో ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ప్రభుత్వం రేషన్
బియ్యాన్ని సరఫరా చేస్తుంది. నిరుపేద లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం,
సరిహద్దులు దాటుతూ రైస్ మిల్లులో చేరుతుంది. పినపాక మండలం లోని కొందరు
రేషన్ డీలర్లు బియ్యాన్ని దొంగచాటుగా, గుట్టుచప్పుడు కాకుండా
అమ్ముకుంటున్నారన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి. పేద ప్రజలకు అందాల్సిన
బియ్యాన్ని కొందరుడీలర్లు తమ ఇష్టా రీతిన పక్కదారి పట్టిస్తున్నారన్న 
ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులలో
ఆహారభద్రత పథకం ద్వారా రేషన్ బియ్యం అందిస్తున్నారు. పేదలకు అందాల్సిన
బియ్యం డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, తెలంగాణ
ప్రభుత్వం డిజిటల్ పద్ధతిని ప్రవేశ పెట్టి బియ్యాన్ని సరఫరా చేసింది.
డిజిటల్ విధానం వచ్చిన తర్వాత వయోవృద్ధులు మరి కొంతమంది వ్యక్తుల
వేలిముద్రలు పడకపోవడంతో రేషన్ బియ్యం తీసుకోవడంలో నానా ఇబ్బందులు
ఎదుర్కొన్నారు. వేలిముద్రలు పడకపోవడంతో లబ్ధిదారులు రేషన్ బియ్యం
తీసుకోకుండానే వెనుదిరిగిపోయేవారు. డిజిటల్ విధానం ద్వారా ప్రజలు ఇబ్బందులు
పడుతున్నారని, కొందరు ఉన్నత విద్యావంతులు సంబంధిత అధికారుల దృష్టికి
తీసుకుని వెళ్లి సమస్యను  పరిష్కరించాలని కోరారు. స్పందించిన అధికారులు
సంబంధిత గ్రామ అధికారుల డిజిటలైజేషన్ ద్వారా అందరికీ రేషన్ అందించేలా
చర్యలు తీసుకున్నారు. ఈ విధానంలో 90% పేద ప్రజలకు రేషన్ అందుకున్నప్పటికీ,
మిగతా 10 శాతం మందికి బియ్యం అందడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే
రేషన్ డీలర్ల పాలిట వరంగా మారిందన్న  ఆరోపణలకు ఆజ్యం పోస్తోంది. మండల
వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలకు గాను, 950
కుటుంబాలు రేషన్ బియ్యం పొందుతుండగా మిగతా 50 కుటుంబాలవారు అనివార్య కారణాల
వల్ల బియ్యాన్ని పొందటం లేదు. కొందరు లబ్ధిదారులు వేరేగ్రామాల్లో
నివసించడం, మరికొందరు లబ్ధిదారులు చనిపోవడంతో వీరికి రావలసిన రేషన్ కూడా
సంబంధ డీలర్లు సరఫరా చేసినట్లు చూపిస్తుండడం గమనార్హం. పినపాక మండలం గోపాల్
రావు పేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఐలాపురం గ్రామంలో నివాసం
ఉంటున్నాడు. అతనికి చెందాల్సిన రేషన్ బియ్యం కోసం డీలర్ ను సంప్రదించగా,
అంతకుమునుపే ఎవరో తీసుకున్నట్లు వివరించాడు. ఎవరు తీసుకున్నారని అడగగా,
డీలర్ సరైన సమాధానం చెప్పలేదు. మండలంలో చాలామంది లబ్ధిదారులు ఇదే విధంగా తమ
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదోళ్లకు చెందాల్సిన బియ్యం ఆటోల్లో,
ట్రాలీల్లో అర్ధరాత్రి సరిహద్దులు దాటుతూ పినపాక, మణుగూరులోని కొన్ని రైస్
మిల్లులోకి చేరుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు
వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్ సప్లై
అధికారులు రేషన్ షాపులలో తనిఖీలు నిర్వహించకుండా చోద్యం చూస్తున్నారని,
రేషన్ అందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్లు
ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని సన్నగా మార్చి, వాటిని పేరుమోసిన బ్రాండ్ల
పేరుతో పినపాక మణుగూరు మండలంలోని పలు దుకాణాలకు విక్రయిస్తూ కాసులు
గడిస్తున్నారు. సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ లోపం, రేషన్ షాప్ లో
తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ప్రభుత్వ రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది.