తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ ….!
మాస్కులు లేకుంటే జరిమానా…!!
- రోడ్డెక్కనున్న బస్సులు, ఆటోలు
- అన్ని షాపులకు, సేవలకు పర్మిషన్
- మెట్రో రైళ్లు బంద్ సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, పార్కులు బంద్
- ఇంటర్ స్టేట్ బస్సులు బంద్
- ఆటోలకు, క్యాబ్ లకు ఓకే…
- అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్
- బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్ లు, జిమ్ లు, పార్కులు బంద్
- అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసివేత
- హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాలకు ఆర్టీసి బస్సులు
- కంటైన్మెంట్ ఏరియాలు తప్ప అన్నీ గ్రీన్ జోన్లే
- 70లక్షల ఎకరాల్లో పత్తి పండిద్దాం
- పంటలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలి కేంద్రం ప్యాకేజీ ఉత్త బోగస్
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్,జ్యోతిన్యూస్ : తెలంగాణలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఈ నెల 29 వరకూ విధించిన లాక్ డౌనను కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జిల్లాలన్నీ గ్రీన్ జోన్లుగా మారాయని స్పష్టం చేశారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. అటు కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలో షాపులు ఓపెన్ చేసుకోవచ్చునని ప్రకటించారు. గతంలో మాదిరిగానే కర్ఫ్యూ రాత్రి పూట 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందన్నారు. సోమవారం సాయంత్రం కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతినిస్తున్నామని, హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగవని, మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో కరోనా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని వెల్లడించారు. పరిశ్రమలన్నింటికీ అనుమతి ఇస్తున్నామని, హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలని, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్ డౌనను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాల పై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. అధికారులతో మాట్లాడి వ్యూహరచన చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీజోన్లేనని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,452 కుటుంబాలు కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్నాయని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీస్ పహారా ఉంటుందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచమే అంగీకరించిందని, కరోనాతో జీవించడం నేర్చుకోవాలని సూచించారు. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలని, హైదరాబాద్ నగరం తప్ప అన్ని చోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని, హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతిస్తున్నామని, ఆటోలో డ్రైవర్ తో పాటు ఇద్దరు, టాక్సీలో డ్రైవంతో పాటు ముగ్గురు ప్రయాణించే నియమం పాటించాలని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చని, ఈ కామకు అనుమతి ఇస్తున్నామని, ఆర్టీసీ బస్సులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తామని, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తలతో, వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని, పరిశ్రమలు కూడా వంద శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని, కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. అలాగే తెలంగాణలోనూ 31 వరకు లాక్ డౌనను కొనసాగిస్తామని తెలిపారు. 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ ఏరియాలో ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణలో లాక్ డౌన్ మార్గదర్శకాలను వివరించారు. కంటైన్మెంట్ ఏరియాలో ప్రభావం ఉన్న పరిసరాల్లోనే లాక్ డౌన్ అమలులో ఉంటుందని, పూర్తిగా పోలీసు పహారాలోనే కంటైన్మెంట్ ఏరియా ఉంటుందన్నారు. 70లక్షల ఎకరాల్లో పత్తి పండిద్దాం రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు. తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని వెల్లడించారు.నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితాలను మనం చూస్తున్నామని, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ తెలంగాణలో ఉందన్నారు. వేలాది పాడిపశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని, 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనని వివరించారు. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని, తెలంగాణలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్ ఉందని తెలిపారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలని, 70 లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండించాలని సూచించారు. గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారని గుర్తు చేశారు. ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలని, ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతు పొందాలని, వ్యవసాయంలో మనం అన్ని రికార్డులను నమోదు చేసుకుంటున్నామని,పాలిహౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ కు సబ్సిడీలు ఇస్తున్నామని తెలిపారు. ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయవద్దని,దానికి బదులు కందులు వేయాలని సూచించారు. తెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉందని తెలిపారు. తెలంగాణ సోనాకు షుగర్ ఫ్రీ రైస్ అని కూడా పేరుందని, యాసంగిలో మక్కలు పండించాలని తెలిపారు. సన్న రకాల్లో తెలంగాణ సోనా మంచిదన్నారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయాలని, 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలని తెలిపారు. నిజామాబాద్, జగిత్యాలలో పసుపు పంట వేసుకోవచ్చని, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సోయాబిన్ వేసుకోవచ్చని, వరి పంటలో తెలంగాణ సోనా రకం పండించాలని సూచించారు. తెలంగాణ పంటలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యే రోజు రావాలని ఆకాంక్షించారు. కరోనాలాంటి మహమ్మారి పై పోరు చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అని విమర్శించారు. కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని, కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని ఎద్దేవా చేశారు. ఎస్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా అని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు.