68,607 కోట్ల ఎగవేత రుణాలు
రద్దు జాబితాలో మెహుల్ చోక్సి, మాల్యా సంస్థలు…ఆర్ టీఐ స్పందనలో ఆర్బీఐ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని అగ్రగామి 50 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదార్లకు చెందిన రూ.68,607
కోట్ల రుణాలను సాంకేతికంగా రద్దు(రైటాఫ్) చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఆ మేరకు సమాధానం ఇచ్చింది. సెప్టెంబరు 30, 2019 వరకు సాంకేతికంగా ఈ రుణాలను రద్దు చేసినట్లు అందులో వివరించింది. రూ.5,492 కోట్లతో మెహుల్
చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ ఈ
జాబితాలో మొదటి స్థానంలో ఉంది. చోక్సీకే చెందిన గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్స్ కు చెందిన రుణాలు రైటాఫ్ అయిన జాబితాలో ఉన్నాయి. ఇక మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ (రూ.1943 కోట్లు) రుణాన్ని సైతం బ్యాంకులు సాంకేతికంగా రద్దు
చేశాయి. ఝు ఝున్ వాలా సోదరులకు చెందిన ఆర్ఈఐ ఆగ్రో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో ఉంది. విన్సమ్ డైమండ్స్ యజమానులపైనా సీబీఐ, ఈడీల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రోటామాక్ కు చెందిన అధిపతి విక్రమ్ కొఠారి, ఆయన తనయుడు రాహుల్ కొఠారిలను రుణ ఎగవేత కేసులో సీబీఐ అరెస్టు చేసింది కూడా. గత పార్లమెంటు సమావేశాల్లో అగ్రగామి 50 రుణ ఎగవేతదార్ల జాబితాను ఇవ్వమని
ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ కోరిన సంగతి తెలసిందే. కాగా, సెప్టెంబరు 30, 2019 నాటికి సాంకేతికంగా రద్దు అయిన 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సమాచారాన్ని ఇస్తున్నట్లు ఆర్బీఐ తన ఏప్రిల్ 24 తేదీతో ఇచిన రాతపూర్వక స్పందనలో తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16 వరకు ఉన్న ఎగవేతదార్ల జాబితాను కోరగా.. ఆ సమాచారం అందుబాటులో లేదని
ఆర్బీఐ తెలిపింది. రుణ ఎగవేతదారులు భాజపా మిత్రులు:
రాహుల్ బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేసినవారు భాజపా మిత్రులేనని, అందుకే ఆ సమాచారాన్ని పార్లమెంటులో వెల్లడించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విజయ్ మాల్యా,
నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ వంటి 50 మంది పారిశ్రామిక వేత్తలు చెల్లించాల్సిన రూ.68,607 కోట్లను మోదీ సర్కారు మాఫీ చేసిందని, ఈ వాస్తవాన్ని సమాచార హక్కు చట్టం కింద భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన సమాధానం రుజువు చేస్తోందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. “దేశంలో బ్యాంకు రుణాలను ఎగవేసినవారిలో అగ్రస్థానంలో ఉన్న 50 మంది వివరాలను ఇవ్వాలని పార్లమెంటులో అడిగాను. ఆర్థిక మంత్రి దానికి సమాధానమివ్వలేదు. ఇప్పుడు ఆర్బీఐ ఆ జాబితాను ఇచ్చింది. దీనిలో నీరప్ మోదీ, చోక్సీ సహా భాజపా ‘మిత్రులు’ అనేకమంది ఉన్నారు.
అందుకే ఈ వాస్తవాన్ని ప్రభుత్వం పార్లమెంటులో చెప్పకుండా దాచిపెట్టింది” అని ఆరోపించారు.
ఆర్బీఐ ఇచ్చిన సమాచారాన్ని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్దేవాలా కూడా పత్రికలకు విడుదల చేశారు. వీరి రుణాలను ఎందుకు మాఫీ చేయాల్సి వచ్చిందో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోసగించి పారిపోయేవారిని ప్రోత్సహించడమే మోదీ సర్కారు
విధానమని విమర్శించారు.