బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

మోదీతో సహా పలువురు బాలీవుడ్ నటుల సంతాపం

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్‌ఖాన్ అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 2018 మార్చిలో తన అనారోగ్య పరిస్థితిపై
తొలిసారిగా ప్రకటన చేసి అభిమానులను షాక్ కు గురిచేశారు. శనివారం రాజస్థాన్ లోని జయపురలో ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం(95) మృతి చెందారు. లాక్ డౌన్ కారణంగా ముంబయిలోనే చిక్కుకుపోయిన ఆయన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయారు. ఇర్ఫాన్ గతంలో యూకేలో క్యాన్సర్ కు చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఇండియాకు వచ్చిన ఇర్ఫాన్ ఇటీవల ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటించారు. అనారోగ్యం కారణంగా ఈ సినిమా
ప్రమోషన్స్ లో కూడా ఇర్ఫాన్ పాల్గొనలేదు. ‘అంగ్రేజీ మీడియం’ తర్వాత ఆయన ఏ సినిమాకి సంతకం చేయలేదు. నిన్న మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఇర్ఫాన్ తుదిశ్వాస విడిచారు. తెలుగులో సైనికుడు చిత్రంలో ఇర్ఫాన్ నటించి మెప్పించారు. 2011లో పద్మశ్రీ
పురస్కారం అందుకున్నారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం సినిమా, నాటక రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకే కాకుండా ప్రపంచ సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ తన
నటనతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారని అన్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పెద్దపేగు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మరణించారు. చిన్న వయసులోనే బాలీవుడ్ విలక్షణ నటుడు మరణించడం బాధాకరమని పలువురు
బాలీవుడ్ ప్రముఖులు ఇర్ఫాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.