గ్రీన్ జోన్ లో పరిశ్రమల ప్రారంభానికి అనుమతులు

మీడియా సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: పరిస్థితులను బట్టి గ్రీజోన్లలో మరిన్ని వెసులుబాటులు కల్పిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ
సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రీన్
జోన్లలో పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుమతిచ్చామని వివరించారు. ప్రజా రవాణాకు ఇప్పట్లో అవకాశం ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు 12కేజీల
చొప్పున బియ్యం పంపిణీ చేసిందని, అందులో కేంద్రం ఇచ్చిన 5కేజీలు,
రాష్ట్రానికి సంబంధించి ఏడు కేజీలు ఉన్నాయని వివరించారు. ఇవాల్టి నుంచి రెండో ఫేజ్ బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, దిల్లీలో లాక్ డౌన్
నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారన్నారు. వైద్య పరికరాలు, కరోనా ప్రత్యేక ఆసుపత్రుల నిర్వహణ కోసం తెలంగాణకు రూ.215 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. గుజరాత్ లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వస్థలాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 54 బస్సుల్లో గుజరాత్ నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయల్దేరారని వెల్లడించారు. ఇందుకు సహకరించిన కేంద్ర ఘోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థాన్లోని కోటలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభిస్తే… కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. మరింత విస్తృతంగా చర్చించి ప్యాకేజీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం.. కరోనా తీవ్రత మేరకు మార్పులు, చేర్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన పప్పు ధాన్యాలను కొన్ని రాష్ట్రాలు తీసుకెళ్లలేదని వాటిని వెంటనే తీసుకెళ్లి పేదలు, వలస కూలీలకు ఇవ్వాలని కోరారు. పనిచేసే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు వసతి, ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి విపత్తు నిధి కింద రూ.224 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ కోసం రూ.207 కోట్లు, భవన నిర్మాణ కార్మికుల
కోసం రూ.126 కోట్లు, ఇచ్చినట్లు వివరించారు.