నిరాడంబరంగా గులాబీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

20వ వసంతంలోకి అడుగు పెట్టిన తెలంగాణ రాష్ట్రీయ సమితి 

  • తెలంగాణ భవన్లో ఉ.9.30కి పార్టీ పతాకావిష్కరణ
  • పాల్గొన్న సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు
  • అన్ని రంగాలలో అద్భుత విజయం సాధించాం
  • పార్టీ శ్రేణులంతా ఖచ్చితంగా లాక్ డౌన్ పాటించాలి
  • ఆకట్టుకున్న కేటీఆర్ కవితాత్మక ట్వీట్లు
  • కార్యకర్తలంతా వారం రోజులపాటు రక్తదానం 

హైదరాబాద్: తెరాస ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తికానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న రాష్ట్రంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను తెరాస సాధించిందన్నారు. సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెరాస సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని.. ఇది తెరాస శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని సీఎం అన్నారు. తెరాస ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకలను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని.. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేద్దామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస ఈ రోజు 20వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అలాగే, జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు కేటీఆర్, ఈటలతో పాటు కేకే తదితర ముఖ్య నేతలంతా మాస్కులు ధరించి పాల్గొన్నారు. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెరాస ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలతో అనేక విజయాపజయాలు, ఒడుదొడుకులు ఎదుర్కొని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినా కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నిరాడంబరంగా జరపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలంతా ఎవరి ఇంటి పై వారు పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. వారం రోజుల పాటు రక్తదానం చేయాలని దిశానిర్దేశం చేశారు. తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్లో నిరాడంబరంగా జరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన ఉద్యమ పార్టీ సోమవారానికి 20వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని, గులాబీ జెండా కీర్తిని వర్ణిస్తూ కవితాత్మకంగా పెట్టిన ట్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. “ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు…ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది స్ఫూర్తి ప్రదాతా వందనం.. ఉద్యమ సూర్యుడా వందనం..20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శు భాకాంక్షలు జై తెలంగాణ! జైజై కేసీఆర్” అని పేర్కొన్నారు. అలాగే జెండా గురించి వర్ణిస్తూ.. “తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా ..గుండె గుండెను ఒకటి చేసిన జెండా…ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా పేదవాడి ఆకలి తీర్చిన జెండా…రైతన్నకు భరోసా ఇచ్చిన జెండా… తెలంగాణ ప్రజలకు అండా దండా మన గులాబీ జెండా…మన గులాబీ జెండా పుట్టిన రోజు పండగ, ప్రతి గులాబీ సైనికుడికి…జై తెలంగాణ” అంటూ ఆయన వర్ణించారు.