జూన్ 30 వరకూ జనాలు గుమిగూడొద్దు

ఉత్తర్వులు జారీ చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్

లక్నో : కరోనా మహమ్మారి తీవ్రత తగ్గకపోవడంతో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే 3 వరకూ కొనసాగిస్తూనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకూ జనాలు గుమిగూడవద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించినట్లు మే 3 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఒకవేళ దేశంలో కరోనా కేసులు తగ్గి, కేంద్రం మే 3 తర్వాత లాక్ డౌనను ఎత్తేస్తే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు యూపీకి అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరే అవకాశాలు ఉండటంతో యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జూన్ 30 వరకు రాష్ట్రంలో సభలు, సమావేశాలపై నిషేధం విధించింది. పెద్ద సంఖ్యలో జనం ఎక్కడా ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తదుపరి పరిస్థితిని బట్టి నిషేధం పై చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, బాధితులకు అందుతున్న వైద్య సహాయాల పై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగానే అధికారులు, వైద్య సిబ్బంది సూచనల మేరకు జూన్ 30 వరకు సభలు, సమావేశాల పై నిషేధం విధించారు. కాగా దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నుంచి సడలింపులు ఇస్తున్న తరుణంలోనే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.