ఎఎస్పై కుటుంబానికి 50లక్షలు
సిఎం జగన్ కు డిజిపి కృతజ్ఞతలు
విజయవాడ,జ్యోతిన్యూస్ : లాక్ డౌన్లో విధులు నిర్వర్తిస్తూ కరోనాతో మృతి చెందిన పరిగి ఏఎస్ఎ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ… బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్ సవాంగ్ కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో లాక్ డౌన్ పరిస్థితులను డీజీపీ గౌతం సవాంగ్ సమీక్షించారు. జిల్లాలో పర్యటించి కరోనా నియంత్రణ చర్యలను ఆయన తనిఖీ చేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను డీజీపీ ఆదేశించారు. ‘కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విదేశాల నుంచి ఏపీకి 28వేల మంది వచ్చారు. అన్ని శాఖలతో పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. పోలీసులకు పీపీఈ కిట్ల కొనుగోలుకు రూ.2.89కోట్లు కేటాయించారు. కరోనాతో మృతి చెందిన ఏఎన్ఏ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు. కరోనా నివారణకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని’ గౌతం సవాంగ్ ప్రశంసించారు.