ప్రకాశంలో కరోనా కలకలం
జిల్లాలో 53కు చేరిన పాజిటివ్ కేసులు
ఒంగోలు,జ్యోతిన్యూస్ : ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 53కు చేరింది. చీరాలలో ఒకరు, గుడ్లూరులో ఒకరు, పొరిసపాడు మండలం రావినూతలలో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ ముగ్గురిని ఒంగోలు రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. గ్రామాణ ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. రావినూతలలో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది. ఆరు రోజుల క్రితం ఆదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కు నెల్లూరులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతనికి కాంటాక్ట్ లిస్టులో ఉ న్న నర్సుకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె పనిచేస్తున్న ఆస్పత్రి సిబ్బందితో పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రావినూతలలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒంగోలు నగరంతో పాటు మున్సిపాల్ ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు గ్రామాణ ప్రాంతాల్లో కూడా వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కరోనా నుంచి ప్రజలను కాపాడలంటూ జిల్లాలోని జె.పంగులూరులో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మమ్మ అమ్మవారికి పూజలు చేసి వైరస్ ప్రభావం తగ్గిపోయి ప్రజలంతా క్షేమంగా ఉండేట్లు చూడాలని కోరుకున్నారు.