వ్యాక్సిన్ పరీక్షకు అతిదగ్గరలో ఉన్నాం
ఇప్పటికే పురోగతి సాధించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: మానవాళి పాలిట మృత్యుశాపంగా మారిన కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని.. దీనిలో ఇప్పటికే పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వ్యాక్సిన్ ను పరీక్షించేందుకు ఇంకా ఎంతో దూరం లేదని వ్యాఖ్యానించారు. అతి త్వరలో దీనికి సంబంధించిన పరీక్షలు జరపబోతున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీకి నిర్దిష్ట సమయం పడుతుందని.. అయినప్పటికీ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శ్వేతసౌధంలో రోజు వారీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే వైరస్ వ్యాప్తి, ఆర్థిక పరిస్థితుల పై కూడా మాట్లాడారు. జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ.. కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను దశలవారీగా తెరుస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ ప్రక్రియను అత్యంత జాగరూకతతో చేపడతామని వెల్లడించారు. ఎకానమీని తిరిగి పునరుద్ధరించాలన్న తొందరలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులోనూ సురక్షితంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళికలోనే అందుకు సంబంధించిన జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. భౌతిక దూరం ఇక సుదీర్ఘ కాలం.. – వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా విధించిన నిబంధనల్ని ప్రజలు మే 1 తర్వాత కూడా పాటించాల్సి ఉంటుందని ట్రంప్ గుర్తుచేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలు మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. భౌతిక దూరం, చేతుల్ని తరచూ శుభ్రపరచుకోవడం, మాస్కులు ధరించడం, అవసరమైతేనే బయటకు రావడం వంటి నిబంధనల్ని పాటించాల్సిందేనని తెలిపారు. ప్రతి ఆరుగురిలో ఒకరు నిరుద్యోగి… మహమ్మారి దెబ్బతో అమెరికాలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరింది. ప్రతి ఆరుగురు ఉద్యోగులు లేదా కార్మికుల్లో ఒకరు ఉపాధి కోల్పోయారని తాజాగా విడుదలైన ఓ అధ్యయనం వెల్లడించింది. నిరుద్యోగం మహా మాంద్యం నాటి రోజుల స్థాయికి పడిపోయిందని తెలిపింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ప్రభుత్వం గురువారం 500 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు గురువారం సభలో ఆమోదం అభించింది. ఇప్పటి వరకు దాదాపు 2.6 కోట్ల మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయినట్లు అధ్యయనం వెల్లడించింది. వీరంతా ప్రస్తుతం నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకున్నారు