నేటి నుంచి ‘ఆక్స్ ఫర్డ్’ టీకా ప్రయోగాలు
కోవిడ్ నియంత్రణకు బ్రిటన్లో చర్యలు వేగవంతం
లండన్: కొవిడ్ కు టీకా అభివృద్ధి పై ప్రయోగాలను గ్రేట్ బ్రిటన్ మరింత వేగవంతం చేసింది. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకాను మనుషులపై గురువారం నుంచే ప్రయోగించనుంది. ఈ ప్రయోగం విజయం సాధించేందుకు 80% అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ లోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే రానున్న సెప్టెంబరు నాటికి లక్ష డోసుల మేరకు టీకాలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాంక్ కాక్ మాట్లాడుతూ… ‘వైరస్ ను ఓడించేందుకు టీకా ఒక్కటే మార్గం. ఇది పూర్తిగా కొత్త వ్యాధి. టీకా కోసం మా ఎదుట ఉన్న అవకాశాలన్నీ వాడతాం. అనుకూల ఫలితమొస్తే వీలైనంత తొందరగా బ్రిటన్ వాసులకు అందుబాటులోకి తెస్తాం’ అని ప్రకటించారు.