కేంద్ర ఉద్యోగులకు షాక్
గతంలో ప్రకటించిన డీఏను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ : కరువు భత్యం(డీఏ) పై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం షాకిస్తూ.. గతంలో ప్రకటించిన డీఏను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గతంలో పెంచిన డీఏ, డీఆర్ ను నిలుపుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021, జులై వరకు పెంచిన డీఏను నిలిపివేశారు. 2020, జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిలు చెల్లింపు కూడా ఉ ండదని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. 2021, జూన్ 30 వరకు ప్రస్తుతమున్న డీఏ మాత్రమే కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం వల్ల 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారుల పై ప్రభావం పడింది. గత నెలలో పెంచిన కరువు భత్యాన్ని అమలు చేస్తే కేంద్రం పై రూ. 14,595 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర కేబినెట్ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. పెంచిన 4 శాతం డీఏకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరువు భత్యం పెంపును నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం, మార్చి 24 నుంచి లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా పన్నుల నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఉత్పత్తుల ఖర్చులు పెరిగాయి. నిధుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను తగ్గించుకుంటోంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్ లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి, మంత్రులు, అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుల జీతాలను ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం తగ్గించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండు సంవత్సరాలు నిలిపివేసింది. దీంతోపాటు కరోనా బాధితులను, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వోద్యోగుల (రెవెన్యూ శాఖ) ఒక రోజు వేతనాన్ని కోత విధించి ఈ నిధులను సీఎం కేర్స్ జాతీయనిధికి జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తమ ఉద్యోగుల జీతాలను తగ్గించిన సంగతి తెలిసిందే