అమలు చేయాల్సిందే
వాణిజ్య ఒప్పందంపై డ్రాగన్ దేశానికి ట్రంప్ తాజా హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికాతో కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందానికి చైనా కట్టుబడి ఉండాలని అగ్రరాజ్యాధిపతి ట్రంప్ డ్రాగన్ దేశానికి ఘాటుగా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నెపంతో తప్పించుకుంటే ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామని హెచ్చరించారు. ఏడాదిన్నర పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవర పెట్టిన వాణిజ్య యుద్దానికి తెరదించుతూ జనవరిలో ఇరు దేశాలు తొలిదశ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒకరికొకరు తమ దేశాల దిగుమతులపై పోటాపోటీగా పెంచిన సుంకాల పరంపరకు కళ్లెం పడింది. కానీ, కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. చైనా సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఒప్పందం అమలును చైనా జాప్యం చేసే అవకాశం ఉ ందని భావించిన ట్రంప్ ఆ దేశానికి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తీరు పై ట్రంప్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా డ్రాగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వైరస్ అమెరికా సైనికుల ద్వారానే తమ దేశంలోకి ప్రవేశించిందని చైనా సైతం ఓ దశలో ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఈ తరుణంలో ట్రంప్ వాణిజ్య ఒప్పందాన్ని తెర మీదకు తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఒప్పందమే రద్దయితే తిరిగి వాణిజ్య పోరుకు తెరలేవొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం.. 200 బిలియన్ డాలర్ల విలువచేసే అమెరికా ఉత్పత్తుల్ని చైనా కొనుగోలు చేయాల్సి ఉంది. దీన్ని యథాతథంగా కొనసాగించాలని ట్రంప్ కోరుతున్నారు. కానీ, కరోనా సంక్షోభం నేపథ్యంలో ఒప్పందంలోని ఓ కీలక నిబంధనను చైనా తెర మీదకు తెచ్చే అవకాశం ఉందని ‘యూఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్’ ఓ నివేదికలో అభిప్రాయపడింది. ఆ నిబంధన ప్రకారం.. ప్రకృతి విపత్తు లేదా అనుకోని సంక్షోభం ఎదురైతే తిరిగి కొత్త వాణిజ్య ఒప్పందానికి ప్రతిపాదించొచ్చు. కానీ, అదే జరిగితే ఒప్పందాన్నే రద్దు చేసుకుంటామని తాజాగా ట్రంప్ అంటున్న మాట. “ఒకవేళ అదే జరిగితే వాణిజ్య ఒప్పందాన్నే రద్దు చేసుకుంటాం. ఇక అప్పుడు ఏం చేయాలో అది చేస్తాం. చైనా పై నా కంటే కఠినంగా ఎవరూ వ్యవహరించలేరు” అని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్: చైనాకు వ్యతిరేకంగా అమెరికాలోని ఓ రాష్ట్రం అక్కడి కోర్టులో దావా వేసింది. కరోనా వైరస్ వ్యాప్తి పై చైనా సమాచారాన్ని తొక్కి పెట్టిందని.. హెచ్చరించిన ప్రజావేగులను అరెస్టు చేసిందని వ్యాజ్యంలో ఆరోపించారు. దీని వల్ల మానవ సమాజానికి ఎనలేని నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఆర్థికంగానూ ప్రపంచ దేశాలు చితికిపోయాయన్నారు. ఈ మేరకు మిస్సౌరీలోని ఓ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ ఎరిక్ దావా వేశారు. చైనా ప్రభుత్వంతో పాటు, అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ, ఇతర ఉన్నతాధికారులు, సంస్థలను ఇందులో చేర్చారు. కరోనా వైరస్ నేపథ్యంతో ఓ కోర్టులో చైనా పై ఈ తరహా దావా వేయడం ఇదే తొలిసారి. ఈ దావాలో ఆ రాష్ట్రం తీవ్ర ఆరోపణలు చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉన్న తొలిదశలో చైనా కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించింది. వైరస్ పై జరిపిన పరిశోధనల్లోని కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిందంది. అలాగే ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్లు డిసెంబరులోనే స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ.. ప్రపంచం ముందు ఈ నిజాన్ని నిరాకరించిందని చెప్పుకొచ్చింది. చివరకు పీపీఈ కిట్లను సైతం దాచి పెట్టిందని ఆరోపించింది. వైరస్ విజృంభణ రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ.. కట్టడి చేసేందుకు చైనా నాయకత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంది. పైగా వైరసకు పుట్టిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరం నుంచి అనేక మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు అనుమతించిందని ఆరోపించింది. అనేక మందికి వైరస్ సోకేందుకు కారణమైందని పేర్కొంది. ప్రజా జీవితాన్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టడం, ప్రమాదకర పనులకు పాల్పడడం, నిబంధనల్ని ఉల్లంఘించడం వంటి నేరాల కింద విచారణ జరిపాలని దావాలో కోరింది.