ప్రపంచానికి చుక్కలు

విశ్వవ్యాప్తంగా కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 26 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మందికి పైగా కోలుకున్నారు. కరోనాతో కోలుకున్న వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అమెరికాలో బాధితుల సంఖ్య 8 లక్షలు దాటిపోగా, 45 వేలకు పైగా చనిపోయారు. అలాగే స్పెయిన్లో కరోనా బాధితులు 2లక్షల పైనే ఉండగా, 21 వేల 282 మంది మృతి చెందారు. ఇటలీలో 1 లక్షా 83 వేల 957 మంది కరోనా వైరస్ బారిన పడగా, 24,648 మంది చనిపోయారు. అలాగే ఫ్రాన్స్ , జర్మనీ , యూకేలో కూడా కరోనా విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మంగళవారం ఏకంగా 2751 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో అక్కడ మరణాల సంఖ్య 45,373కు పెరిగింది. ఇక సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు అంటే 24 గంటల్లో 40 వేల కేసులు వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో వైరస్ బారినపడ్డవారి సంఖ్య 8,26,240కి చేరింది. ఇక అమెరికాలో కరోనా మహమ్మారి ఈ ఏడాదిలో మరోసారి విజ ఎంభిస్తుందని ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనాతో పాటు ఫ్లూ కూడా అదే సమయంలో ప్రతాపం చూపుతుందని తెలిపారు. రెండు ఒకేసారి విజృంభిస్తే పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించారు.