పెండింగ్ దరఖాస్తులు పరిశీలించండి
తెల్ల రేషన్ కార్డుల పై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ బహిరంగ లేఖ
హైదరాబాద్: కొవిడ్-19 పై టీపీసీసీ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మూడో బహిరంగ లేఖ రాసింది. రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనాను దృష్టిలో ఉ ంచుకొని లాక్ డౌనను మే 7 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిటీ స్వాగతిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రభుత్వం తరపున అందిస్తున్న రూ.1500 నగదు సాయం 13.4 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు ఇంకా అందలేదన్నారు. ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న దాదాపు 18 లక్షల తెల్లరేషన్ కార్డుల దరఖాస్తులు, 4.5 లక్షల ఇతర బీపీఎల్ దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని కోరింది. రైతుబంధు లబ్దిదారులను, తెల్లరేషన్ కార్డుదారులను బ్యాంకు నుంచి నగదు డ్రా చేయడానికి అనుమతించడం లేదని పేర్కొంది. ఇటీవల పలుప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం, వడగళ్ల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంది. మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కుమ్రం భీం, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయినందున సత్వరమే వారందరికీ నష్ట పరిహారం చెల్లించాలని కమిటీ కోరింది. ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన తేదీల్లో రైతులు సేకరణ కేంద్రాలకు వస్తున్నా కనీసం 4-5 రోజులు వేచి చూడాల్సి వస్తోందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఆకస్మిక వర్షాలు, వర్షం నీరుతో సేకరణ కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యానికి నష్టం వాటిల్లితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వాతావరణ శాఖ రాబోయే వర్షాల గురించి హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆహార పంటలను సేకరించడానికి 2800 కేంద్రాలున్నప్పటికీ గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల పిడుగుపాటుగు గురై మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గడచిన 15 రోజుల్లో రెండు సార్లు మంత్రివర్గ సమావేశాలు జరిగినా రైతుల సమస్యలపై చర్చించలేదని, పసుపు, మామిడి, మిర్చి, బత్తాయి పంటలపై దృష్టి సారించాలన్నారు.